తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ హంగామా మొదలైపోయింది. అడ్వాన్సు బుకింగ్ కౌంటర్లు తెరచుకోవడంతో.. అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతున్నారు. సెన్సార్ కూడా పూర్తవ్వడంతో, ఆ రిపోర్టు మెల్లమెల్లగా బయటకు పాకుతోంది. ఈ సినిమాలోని సెకండాఫ్ లో ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ ఉందని, అభిమానులు సర్ప్రైజ్ అవుతారని చిత్రబృందం చెబుతోంది. ఆ సర్ప్రైజ్ ఏమిటా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ యంగ్ హీరో అతిథి పాత్రలో మెరుస్తాడని ప్రచారం జరిగినా.. అదేం లేదని తేలిపోయింది.
మరీ ముఖ్యంగా ఈ సినిమా చివరి 20 నిమిషాలపై చిత్రబృందం గట్టిగా ఆశలు పెట్టుకుంది. `పింక్` సినిమాలోనూ క్లైమాక్సే హైలెట్. అయితే యదాతథంగా అదే చూపిస్తే జనాలకు బోర్ కొడుతుంది. కొత్తగా ప్రయత్నించిన భావన రాదు. అందుకే ఆ ఫీల్ పోకుండా.. సరికొత్తగా క్లైమాక్స్ రాసుకున్నారని టాక్. ఈ క్లైమాక్స్ లోనే ఓ ఫైట్ కూడా జోడించారు. చివరి 20 నిమిషాలూ సినిమాకు ఆయువుపట్టని, ఆయా సన్నివేశాల్ని ప్రేక్షకులు, ముఖ్యంగా పవన్ అభిమానులు ఎలా స్వీకరిస్తారు? అనే విషయంపైనే ఈ సినిమా జాతకం ఆధారపడి ఉందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ 20 నిమిషాలూ క్లిక్ అయితే.. 2021లో ఓ భారీ బ్లాక్ బ్లస్టర్ చూడడం ఖాయమని ఇన్ సైడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.