శంకర్ స్టామినా ఏమిటో సినీ ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ‘భారతీయుడు’. డభ్భై ఏళ్ల పండు ముసలితో శంకర్ హీరోయిజం పండించిన తీరు.. నభూతో. న భవిష్యత్. కమల్ నట విశ్వరూపం గురించి సరే సరి. సినిమా గ్రామర్ని, సినిమా సమాజాన్ని చూసే విధానాన్ని మార్చిన సినిమాల్లో కచ్చితంగా ‘భారతీయుడు’ ఉంటుంది. ఇప్పుడు 28 ఏళ్ల తరవాత ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. సీక్వెల్ సినిమా ఓ సక్సెస్ఫుల్ ఫార్ములా. ఇందులy ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే మరీ పాతికేళ్లు, ముఫ్ఫై ఏళ్లు అయిన సినిమాకు సీక్వెల్ రావడమే కాస్త కొత్తగా ఉంది. శంకర్ – కమల్ హాసన్ మరోసారి కలిసి పని చేయడంతో ‘భారతీయుడు 2’పై అశలూ, అంచనాలూ పెరిగిపోయాయి.
అయితే.. ‘భారతీయుడు 2’తో మెప్పించడం అంత సులభమా? అంటే కచ్చితంగా కాదు. ఎందుకంటే 28 ఏళ్ల నాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పటికీ ఇప్పటికీ చాలా మారాయి. కరప్షన్‌తో సహా. అప్పట్లో మీడియా ఇంత ఉధృతంగా ఉండేది కాదు. సమాజంలో అవినీతి ఏయే రూపాల్లో పేరుకుపోతోందో అంత అవగాహన కూడా లేదు. కాబట్టి శంకర్ ఏం చెప్పినా, ఎలా చెప్పినా జనం చూశారు. ఇప్పుడు టీవీలూ, పేపర్లూ సోషల్ మీడియా ఎప్పటికప్పుడు అవినీతి కథనాల్ని కళ్లకు కడుతున్నాయి. అవన్నీ చూసి జనాలు కూడా మొద్దుబారిపోయారు. ఇప్పుడు కూడా అదే తరహా అవినీతి, నేరమూ – శిక్ష టైపు కథలు చెబుతానంటే కుదరదు. అంతకు మించి ఏదో కావాలి. అవినీతికి మందు ఏమిటి? అనేది శంకరే కాదు, ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. కాబట్టి ఇలాంటి కథలకు సొల్యూషన్ ఆలోచించకూడదు. కాకపోతే ఎంత ఎఫెక్టీవ్ గా తెరపైకి తీసుకొచ్చాడన్నది ముఖ్యం.
శంకర్ సినిమాలు విజువల్ ఫీస్ట్ గా ఉండేవి. పాటల్లో ఆయన చూపించే లొకేషన్ల కోసమే మళ్లీ మళ్లీ జనాలు థియేటర్లకు వెళ్లేవారు. అయితే ఇప్పుడు ప్రపంచం చిన్నదైపోయింది. తెరపై భారీదనం చూపిస్తే, కళ్లు బైర్లు కమ్మేసే రోజులు కూడా పోయాయి. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ హవా ఆ స్థాయిలో ఉంది. ఏది రియల్ లొకేషనో, గ్రాఫిక్స్ మాయాజాలమో కనిపెట్టడం కష్టమైపోయింది. కాబట్టి ప్రపంచమంతా తిరిగి అద్భుతమైన లొకేషన్లు పట్టినా, ప్రేక్షకులకు పట్టడం లేదు. సో.. విజువల్స్, లొకేషన్లతో శంకర్ మాయ చేయలేడు. కథ, కథనాలు, క్యారెక్టరైజేన్స్, కథలో మలుపులూ, సంఘర్షణ.. ఇవన్నీ ఎప్పటికీ పాత పడవు. శంకర్ వీటినే నమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. లంచం తీసుకొంటే చంపేస్తా అంటూ పాత భారతీయడు టైపు వార్నింగులొక్కటే ఉంటే ‘భారతీయుడు 2’ అంచనాల్ని అందుకోవడం కష్టం. అంతకు మించిన సర్ప్రైజ్ ఏదో ఇవ్వాలి. తెరపై ఈసారి కమల్ హాసన్‌తో పాటుగా సిద్దార్థ్, ఎస్.జె.సూర్య, బాబీ సింహా లాంటివాళ్లు ఉండడం అదనపు బలమే. శంకర్ సినిమాలకు వెన్నుదన్నుగా నిలిచే సుజాత లాంటి రైటర్ ఇప్పుడు లేకపోవడం పెద్ద మైనస్. మరి ఈ ప్లసుల్నీ మైనస్సుల్నీ శంకర్ ఎలా బ్యాలెన్స్ చేసుకొంటాడు, 28 ఏళ్ల తరవాత కూడా ‘భారతీయుడు 2’ మ్యాజిక్‌ని ఎలా రిపీట్ చేయగలడు? అనేదానిపైనే ఈ సినిమా జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.