దేశంలో అసహనం పెరుగుతోందని ఎవరైనా అంటే.. వారు దేశద్రోహులని ముద్ర వేసే పరిస్థితి ఏర్పడింది. అయినా.. కొంత మంది మేధావులు ధైర్యం చేసి.. నేరుగా ప్రధానమంత్రి మోడీకే లేఖ రాశారు. దేశంలో ఇలాంటి పరిస్థితి ఉంది.. కాస్త చక్కదిద్దండి… అని వేడుకున్నారు. కానీ సమస్య ఏమిటంటే.. వాళ్లంతా మేధావులు. వాళ్ల ఆలోచనలు సామాన్యులకు అర్థం కావు. వారు తమ ఆవేదనను.. లేఖ రూపంలో ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
“జై శ్రీరామ్” అనకపోతే కొట్టి చంపేస్తారా..?
దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న అసహనంపై… మేధావులు పోరుబాట పట్టారు. గతంలో ఓసారి అసహనంపై నోరు విప్పిన ప్రముఖులు.. ఇప్పుడు మళ్లీ మోడీకి లేఖ రాశారు. దేశంలో పరిస్థితి రోజురోజుకి మారిపోతోందని.. జై శ్రీరామ్ అనే నినాదం.. యుద్ధ నినాదంగా మారుతోందని.. స్పష్టం చేశారు. లేఖ రాసిన వారిలో.. మణిరత్నం, అదూర్ గోపాలకృష్ణన్, అనురాగ్ కశ్యప్, శ్యామ్ బెనగల్, అపర్ణ సేన్, సుమత్రో ఛటర్జీ, అనుపమా రాయ్‌తో సినిమా డైరెక్టర్లు, నిర్మాతలు, సెలబ్రెటీలు ఇతర రంగాల ప్రముఖులు ఉన్నారు. జై శ్రీరామ్ అనే నినాదం దేశంలోని ఎంతో మంది మెజార్టీలకు పవిత్రమైంది. కానీ కొందరు దాడులకు ఉపయోగించుకుంటున్నారు. సంస్కృతి ఆపాలంటూ ప్రధానికి రాసిన బహిరంగ లేఖలో కోరుతున్నారు మేధావులు.
ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే దేశద్రోహులేనా..?
మూక దాడులు, హేట్ క్రైమ్ మాత్రమే కాదు… కొందరు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దేశద్రోహి, అర్బన్ నక్సల్స్ ముద్రలు వేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నిస్తే.. దేశద్రోహి ముద్రలు వేయడం ఏంటని ప్రశ్నించారు. మత పరమైన దాడులు, హింస రోజురోజుకు పెరుగుతుందని చెప్పారు. ఇది ప్రతి రోజుల ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు. ఇలాంటి వాటికి ఫుల్స్టాప్ పడాల్సిన అవసరం ఉందన్నారు సెలబ్రెటీలు. గతంలోనూ ఇలాగే పలువురు ప్రముఖులు ముందుకు వచ్చారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న మూకదాడులు, అసహనంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే దీనిపై రాజకీయంగా దాడి జరిగింది. ఇప్పుడూ అదే జరిగింది.
మోడీనే కాపాడాలంటున్న మేధావులు ..!
పదేళ్లలో 250కి పైగా మత పరమైన దాడులు జరిగాయి. గత ఏడాదిలోనే దాదాపు 840 మంది దళితులపై దాడులు జరిగాయి. ఇవన్నీ రికార్డుల పరంగానే.. రికార్డుల్లో లేని ఘటనలు ఎన్నో జరిగాయని… వీటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు. మొత్తం 49 మంది సెలబ్రెటీలు సంతకాలు చేసిన ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. మూక దాడులు ఆగాలంటే… నాన్ బెయిలబుల్ కేసులు, కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.