హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిన్న బళ్ళారి నగరంలో మీడియా ఎదుటే ఒక వ్యక్తిపై చేయిచేసుకోవటం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారటం తెలిసిందే. ముఖ్యమంత్రి చేతిలో దెబ్బతిన్నది బళ్ళారి నగర కమిషనర్ పీజీ రమేష్ అని నిన్న వార్తలు వచ్చినప్పటికీ, ఆ కమిషనర్ రమణ, ముఖ్యమంత్రి ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. మరోవైపు ముఖ్యమంత్రి తన ఫేస్బుక్ పేజిలో దీనిపై వివరణ ఇచ్చారు. నిన్న బళ్ళారి వాల్మీకి భవన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో తాను ఒక ప్రభుత్వోద్యోగిపై చేయిచేసుకున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ఇచ్చాయని, ఈ వార్తలు తనను ఆశ్చర్యానికి, విచారానికి గురిచేశాయని పేర్కొన్నారు. తాను ఏ అధికారిపైనా చేయిచేసుకోలేదని రాష్ట్ర ప్రజలందరికీ ఈ ఫేస్బుక్ పేజి ద్వారా తెలియజేయాలనుకుంటున్నానని రాశారు. మరోవైపు బళ్ళారి కమిషనర్ రమేష్ కూడా దీనిపై వివరణ ఇస్తూ, ముఖ్యమంత్రి కొందరు భద్రతా సిబ్బందిపై కోప్పడ్డారని, తనపై కాదని తెలిపారు.