హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు ఎంతో కొంత బూస్ట్ ఇస్తుందని అనుకున్న లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పూర్తిగా ఫెయిలయినా పరిస్థితులు కనిపిస్తున్నాయి . 25 శాతం డిస్కౌంట్ ఇచ్చి మరీ క్రమబద్దీకరించుకోమని ఆఫర్ ఇస్తే కనీసం ఇరవై శాతం మంది కూడా స్పందించలేదు. ఈ ఇరవై శాతం ఎవరో కాదు గతంలో అప్లయ్ చేసుకున్న వంద మందిలో ఇరవై మంది. అంటే గతంలో రెగ్యులరైజేషన్ కు సిద్ధమైపోయి.. ఇనీషియల్ ఫీజు కట్టిన వారిలో ఎనభై శాతం మంది వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది ?
ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత క్లిష్టతరంగా చేసింది. ఓ వ్యక్తి ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలంటే.. గవర్నెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగేలా చేశారు. ఎన్వోసీల కోసం అధికారుల వెంటపడేలా చేశారు. ఇదంతా ఎందుకు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా అందరూ వదిలేశారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏ మాత్రం స్పష్టతతో లేదని అర్థమవుతూనే ఉంది. తమ ప్లాట్ క్రమబద్దీకరిస్తారంటే చాలా మంది డబ్బులు కడతారు..కానీ అన్నీ వదిలేసుకుని ఆఫీసుల చుట్టూ తిరిగి.. అధికారులకు లంచాలిచ్చుకోవాలంటే మాత్రం ఎవరు ముందుకు వస్తారు ?
ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఎలాఅన్నదానిపైనే సరైన అవగాహన ఎవరికీ కల్పించలేదు. చెరువుల రికార్డులన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడు వాటి చుట్టుపక్కల లే ఔట్లకు మాత్రమే పరిశీలన పెట్టి మిగిలిన అన్నింటికీ ఆటోమేటిక్ గా ఎన్వోసీ జారీ చేసే ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. అంతే కాదు.. సమస్యను చాలా సులువుగా పరిష్కరించుకునే అనేక మార్గాలున్నా…ప్రభుత్వం ప్రక్రియను క్లిష్టతరంగా చేసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. దీని గురించి ఆలోచించకుండా మరో నెల సమయం పెంచినా పెద్దగా మార్పు ఉండదు.