రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకొని పెట్టుబడులు, పరిశ్రమలని ఆకర్షించడం, వివిధ అభివృద్ధి లేదా నిర్మాణ పనులల కోసం గ్లోబల్ టెండర్లు పిలవడం సర్వసాధారణమే. విదేశాలతో నెరిపే అటువంటి పనులకి ప్రత్యేకంగా ఒక విదేశీ వ్యవహారాల శాఖని ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నట్లు తాజా సమాచారం. దాని కోసం ఇప్పటికే అవసరమైన కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ శాఖకి తన కుమారుడు కెటిఆర్ నే మంత్రిగా నియమించాలని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కెటిఆర్ ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం తరపున విదేశాలలో తిరిగి అనేకమంది పారిశ్రామికవేత్తలని, అక్కడి ప్రభుత్వాదికారులని కలిసి వచ్చారు. ఆయన కృషి కారణంగా హైదరాబాద్ నగరానికి అమెజాన్ వంటి పెద్ద పెద్ద సంస్థలు తరలివచ్చాయి. విదేశాలలో స్థిరపడిన ఎన్.ఆర్.ఐ.లు, తెలంగాణా నుంచి గల్ఫ్ దేశాలకి వలసలు వెళ్ళే కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి కెటిఆర్ కృషి చేస్తున్నారు. కనుక ఈ పనుల కోసం తెలంగాణా ప్రభుత్వంలో కూడా వేరేగా విదేశీ వ్యవహారాల శాఖని ఏర్పాటు చేసి దాని బాధ్యతలు కెటిఆర్ కే అప్పగించాలని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కెటిఆర్ ఇప్పటికే ఐటి,పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ, మునిసిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖలకి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో విదేశాంగ శాఖ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రప్రభుత్వం అనుమతించి ఉండి ఉంటే, దేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసుకొన్న మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణాయే అవుతుంది. అలాగే కెటిఆర్ దేశంలో మొట్టమొదటి రాష్ట్ర స్థాయి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అవుతారు. ఈ వార్తని తెలంగాణా ప్రభుత్వం ఇంకా దృవీకరించవలసి ఉంది.