గురువారం భారీ అంచనాలతో విడుదలైంది.. ‘హాయ్ నాన్న’. ఈ సినిమాకి రివ్యూలు బాగానే వచ్చాయి. అయితే… ఓపెనింగ్స్ మాత్రం లేవు. ఏపీలో తుపాను వల్ల… వసూళ్లకు గండి పడింది. తెలంగాణలో కూడా ఆశించిన స్థాయిలో టికెట్లు తెగలేదు. నాని సినిమాలకు ఓపెనింగ్స్ సమస్య ఉండేది కాదు. కానీ ‘హాయ్ నాన్న’కు మాత్రం విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. శుక్రవారం నితిన్ సినిమా ‘ఎక్ట్సా ఆర్డనరీ మ్యాన్’ వచ్చింది. దాంతో `హాయ్ నాన్న` వసూళ్లు మరింత మందగించాయి. అయితే… ‘ఎక్ట్సా..’ జోరు ఫస్ట్ షో నాటికి తగ్గిపోయింది. నెగిటీవ్ రివ్యూలు రావడం, మౌత్ టాక్ కూడా బాగోలేకపోవడంతో ‘ఎక్ట్సా..’ నిలవలేకపోయింది. అదే సమయంలో… ‘హాయ్ నాన్న’ స్పీడందుకొంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా కావడం, నానికి కుటుంబ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండడం ‘హాయ్ నాన్న’కు కలిసొచ్చింది. శనివారం నాటికి ‘హాయ్ నాన్న’ నిలబడింది. ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగే అవకాశం ఉంది. ‘సలార్’ వరకూ బాక్సాఫీసు దగ్గర ‘హాయ్ నాన్న’కు పోటీ ఉండకపోవొచ్చు. సోమవారం నుంచి ఎలాంటి సినిమాకైనా వసూళ్లు తగ్గుతాయి. కాకపోతే.. రెండు వారాల వరకూ కొత్త సినిమా లేకపోవడం ‘హాయ్ నాన్న’కు కలిసొచ్చే అంశం. 40% ఆక్యుపెన్సీ ఉన్నా.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోవొచ్చు. నితిన్ సినిమా ఏమాత్రం బాగున్నా నాన్నపై పెద్ద ప్రమాదం ఎదురయ్యేది. కానీ.. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం నాన్నకు కలిసొచ్చింది.