లవ్ స్టోరి రిజల్ట్ తో టాలీవుడ్ కి కాస్త ఊపొచ్చింది. ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సిద్ధంగానేఉన్నారు.. అనే సంకేతాన్ని లవ్ స్టోరి పంపినట్టైంది. దసరా సీజన్ దగ్గర పడుతున్న వేళ… ఇది నిజంగా శుభ సూచకమే. అక్టోబరులో మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకురాబోతున్నాయి. అక్టోబరు 1 నుంచి దసరా సీజన్ మొదలైనట్టే. ఈ నెలంతా వారానికి రెండు మూడు సినిమాలు గ్యారెంటీ. అక్టోబరు 1న సినిమాల హడావుడి బాగానే ఉంది. అయితే అందరి దృష్టీ `రిపబ్లిక్`పైనే.
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం రిపబ్లిక్. దేవాకట్టా దర్శకుడు. ప్రస్థానంతో తనదైన మార్క్ వేసుకున్నాడు దేవాకట్టా. మరోసారి ఓ పొలిటికల్ థ్రిల్లర్ ని తెరపైకి తీసుకొచ్చాడు. రాజ్యంగ వ్యవస్థల గురించి క్షుణ్ణంగా ఈ సినిమాలో చర్చించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఓ సీరియస్ పొలిటికల్ డ్రామా తెలుగులో వచ్చి చాలా రోజులైంది. తేజ్ లోని సిన్సియారిటీ కూడా తెరపై కనిపిస్తోంది. రమ్య కృష్ణ నువ్వా? నేనా? అనే పాత్రలో కనిపించడం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా మారింది. దాంతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది. తేజ్ రోడ్డు ప్రమాదం పాలై.. ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తను లేకుండానే ప్రమోషన్లు జరిగిపోతున్నాయి. ఓ మంచి హిట్ ఇచ్చి – తేజ్ కి బూస్టప్ ఇవ్వాల్సిన సమయం ఇది. దాంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రిపబ్లిక్ తో పాటు గా అసలేం జరిగిందంటే, ఇదే మా కథ చిత్రాలూ ఈ వారంలోనే విడుదల అవుతున్నాయి. ఇదే మా కథలో శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక కీలక పాత్రలు పోషించారు. బాలనటుడిగా సుపరిచితుడైన మహేంద్రన్ హీరోగా అసలేం జరిగిందంటే రూపొందింది. ఈ సినిమాలూ ఈ వారమే అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.