జగన్ రెడ్డి హయాంలో నాడు ప్రతిపక్ష నేతగానున్న చంద్రబాబును రాష్ట్రంలోనే లేకుండా చేయాలనుకున్నారా? టీడీపీ కార్యకర్తకు హాని తలపెట్టి.. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి చంద్రబాబును భయపెట్టాలనుకున్నారా? పోలీసు వ్యవస్థ తమ అధీనంలో ఉందని… ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని హత్యాకాండకు తెరలేపాలనుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఇది మరెవరో రౌడిమూకలు వేసిన ప్లాన్ కాదు. మాజీ మంత్రి జోగి రమేష్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ప్లాన్ ఇది. అవును..అప్పటి ప్రతిపక్ష నేతగానున్న చంద్రబాబు ఇంటిపై 2021సెప్టెంబర్ 17న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరులతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు వైసీపీ అధికారంలో ఉండటంతో ఈ కేసులో ఎలాంటి కదలిక లేకుండా పోయింది. కూటమి అధికారంలోకి రావడంతో పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు. నాడు ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఉండవల్లికి చెందిన తమ్మా శంకరరెడ్డి నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేయగా పలు సంచలన విషయాలను వెల్లడించారు.
చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నిస్తున్నప్పుడు..అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తల్లో ఒక్కరి తల తీసేసినా చంద్రబాబు ఇల్లు వదిలి పారిపోతాడని జోగి రమేష్ తన అనుచరులతో చెప్పినట్లుగా శంకరరెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఆ ఘటన జరిగే రోజున తాము చంద్రబాబును కలవడానికి వెళ్లగా..జోగి రమేష్ తన అనుచరులతో ఐదు కార్లలో వచ్చారని పేర్కొన్నాడు.జోగి రమేష్ ను టీడీపీ నేతలతో కలిసి వారించినా ఆయన పట్టించుకోలేదని చెప్పారు. తమపై దాడి చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టారన్నారు.
శంకరరెడ్డి వాంగ్మూలంతో జోగి రమేష్ కు మరిన్ని చిక్కులు ఎదురవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.