వెంకటేష్ అంటేనే వినోదం. ఆయన కామెడీ టైమింగ్ భలే బాగుంటుంది. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ సినిమాల్ని ఎన్నిసార్లు చూసినా చూడబుద్దేస్తుందంటే దానికి కారణం.. వెంకీ కామెడీ టైమింగే. దాన్ని ఈమధ్య ఎవ్వరూ సరిగా వాడుకోలేడం లేదు. అనిల్ రావిపూడి మాత్రం `నేను వాడేశా` అంటున్నాడు. తను దర్శకత్వం వహించిన ‘ఎఫ్ 2’ ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. వరుణ్‌తేజ్ మరో కథానాయకుడిగా నటించాడు. ‘ఎఫ్ 2’ ప్రీ రిలీజ్ వేడుక విశాఖపట్నంలో జరిగింది. ఈ సందర్భంగా వెంకీ పాత్ర గురించి అనిల్ రావిపూడి క్లూ ఇచ్చాడు.
”వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మేనరిజమ్స్ బాగుంటాయి. ఆయన ఇవ్వని ఎక్స్ప్రెషన్ లేదు. కామెడీ టైమింగ్ పిండుకున్నవాళ్లకు పిండుకున్నంత. ఈ సినిమా కోసం వెంకటేష్ గారిని టైమ్ మిషన్ ఎక్కించి వెనక్కి తీసుకెళ్లాం. మల్లీశ్వరి, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, నువ్వు నాకు నచ్చావ్ రోజుల్లోకి తీసుకెళ్లాం. ఆయన వరుణ్‌తో కలసి పండించే వినోదమే ఈ చిత్రానికి ప్రధాన బలం. వరుణ్ కూడా కామెడీ చాలా బాగా చేశాడు. ఈ సంక్రాంతి మిమ్మల్ని నవ్వించి తీరతాం” అని ధీమాగా చెబుతున్నాడు అనిల్ రావిపూడి. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది.