రేటింగ్: 2.75
పెళ్లాలకు కావల్సింది రెండే రెండు…
వాళ్ల వల్ల మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఐ లవ్ యూ..
మన వల్ల వాళ్లు బాధ పడినప్పుడు.. సారీ!
– `ఎఫ్ 2` లో డైలాగ్ ఇది.
ప్రేక్షకులకూ అంతే. అక్కడక్కడా కొన్ని నవ్వులు.. హాయిగా సాగిపోయే సీన్లు.. కాస్త ఎమోషన్.. అందిస్తే చాలు. భార్యల్లా వాళ్లు కూడా నెత్తిమీద పెట్టేసుకుంటారు. అది మర్చిపోయి తిమ్మిని బమ్మిని చేయాలని చూసేవాళ్లు కొందరైతే – ప్రేక్షకులకు కావల్సింది ఇచ్చేసి.. `అంతేగా… అంతేగా` అంటూ వాళ్లను సంతృప్తి పరిచేసేవాళ్లు మరి కొందరు. అనిల్ రావిపూడి రెండో టైపు. ఏదో కొత్తగా ట్రై చేద్దాం, ఇంకేదో చెబుదాం అని రిస్కు తీసుకోడు. ఉన్నదాన్నే కాస్త మేకప్ చేసి, గిఫ్ట్ రాపర్ చుట్టి అందంగా అందిస్తాడు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్‌లలో చేసింది అదే. సేమ్ టూ సేమ్ అదే ఫార్ములా, అదే ఫన్నుతో `ఎఫ్ 2`ని రంగంలోకి దింపాడు. మరి ఈసారి అనిల్ రావిపూడి ఏం చేశాడు…అటు వెంకీతోనూ, ఇటు వరుణ్తోనో ఎంత వినోదం పండించాడు?
కథ
వెంకీ (వెంకటేష్) ఎం.ఎల్.ఏ దగ్గర ఏపీగా పనిచేస్తుంటాడు. హారిక (తమన్నా)ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లయిన కొత్తలో వాళ్ల కాపురం మూడు సర్ఫెక్సల్ ప్యాకెట్లు, ఆరు మూరల మల్లెపూలులా హాయిగా సాగిపోతుంది. ఆరు నెలల తరవాత… `ఈగో`లు మొదలవుతాయి. `నువ్వు మారిపోయావ్.. నువ్వు మారిపోయావ్` అంటూ హారిక… వెంకీని ఆడేసుకుంటుంటుంది. ఆ ఫస్ట్రేషన్‌తో అల్లాడిపోతుంటాడు వెంకీ. హారిక చెల్లెలు హనీ (మెహరీన్)ని వరుణ్ యాదవ్ (వరుణ్ తేజ్) ప్రేమిస్తాడు. ఇంట్లోవాళ్లు పెళ్లి కూడా కుదిర్చేస్తారు. కానీ… హనీతో హాయిగా కాపురం చేయడం అంత సులభం కాదన్న నిజం గ్రహిస్తాడు వరుణ్. అటు వెంకీ కూడా హారిక పెట్టే టార్చర్ భరించలేకపోతాడు. దాంతో ఇద్దరూ కలసి చెప్పాపెట్టకుండా యూరప్ వెళ్లిపోతారు. ప్రేమించిన వాళ్లు దూరమయ్యాకైనా హారిక, హనీ మారారా? వెంకీ, వరుణ్‌ల ఫస్ట్రేషన్ యూరప్‌లో అయినా తీరిందా? లేదా? అనేదే కథ.
విశ్లేషణ
ఒకరు భార్యా బాధితుడు, మరొకడు ప్రేయసి బాధితుడు… వారిద్దరి ఫస్ట్రేషన్ ఈ సినిమాకి మూలం. కథగా అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్కేం లేదు. తను చేసిందల్లా.. ఇంత చిన్న కథని అందంగా, వినోదాత్మకంగా చెప్పడమే. ప్రతి సన్నివేశం సరదాగా అల్లుకుంటూ వెళ్లాడు. నవ్వించాడు. `ఇక్కడేమీ లేదు కదా` అనే ఫీలింగ్ రాకుండా కామెడీతో కవర్ చేసేశాడు. ఉదాహరణకు… ఎం.ఎల్.ఏ (రఘుబాబు) పాత్ర. దానికీ కథకూ సంబంధం ఉందా? అస్సల్లేదు. కానీ ఆ పాత్రని కథలోకి లాక్కొచ్చి… కామెడీ చేయించేశాడు. కుక్కతో మనిషి మాట్లాడడం, మనిషి చెప్పే కథ వింటూ అతి తలాడిస్తూ తల్లడిల్లిపోవడం ఎక్కడైనా చూస్తామా? `ఎఫ్ 2`లో చూస్తాం. ఇక్కడ దర్శకుడు చేసిన ప్రయత్నం నవ్వించడానికి. కాబట్టి.. ఆ లాజిక్కులు మర్చిపోయి హాయిగా నవ్వేస్తాం. అమ్మాయిల మనస్తత్వాలు, భార్యల ఆలోచనలు బాగా చదివేశాడు అనిల్ రావిపూడి. అందుకే.. వాటి చుట్టూనే సన్నివేశాలు రాసుకున్నాడు. అలాంటి డైలాగులే పలికించాడు. `బారుకి తీసికెళ్లి ఇద్దరు శత్రువుల మనసు మార్చొచ్చు. కానీ చీరల షాపులో ఇద్దరి ఆడవాళ్లని కలపలేం` లాంటి డైలాగులు అలానే పుట్టుకొచ్చాయి. `నువ్వు పాని పట్టు యుద్ధం చూళ్లేదా? ఇక్కడ కంచి పట్టు యుద్ధం చూడు` లాంటి సంభాషణలు అందుకే రాసుకున్నాడు. `లేడీస్ ఈజీగా నమ్మేది చాడీస్` అన్నా.. ఏ ఆడదాని మనసు నొచ్చుకోదు. సరదాగా నవ్వేసుకుంటారు. అలాంటి సరదా సదదా సన్నివేశాలు, కేరింతలతో ఫస్టాఫ్ హాయిగా, ఎలాంటి బ్రేకులు లేకుండా సాగిపోతుంది. మధ్య మధ్యలో వెంకీ మేనరిజాలు, అన్నపూర్ణ – వై.విజయల నిష్టూరాలూ… బోనస్లుగా కనిపిస్తాయి. ఇంట్రవెల్ బ్యాంగు ఇచ్చి, ఆడియన్స్‌ని టీ – కూల్ డ్రింగులకు బయటకు పంపించేటప్పుడు కూడా వెంకీ తనదైన స్టైల్లో నవ్విస్తాడు.
ఇంత ఫన్ చూశాక… సెకండాఫ్ ఇంకా బాగుంటుందని, మరిన్ని నవ్వులు ఏరుకోవచ్చని సగటు అభిమాని ఆశ పడడం లో తప్పులేదు. ఈ బేస్ మెంట్‌పై అనిల్ రావిపూడి కూడా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లా కలకాలం మిగిలిపోయే సినిమా తీయొచ్చు. కానీ.. దాన్ని సరిగా వాడుకోలేదనిపిస్తుంది. కథని యూరప్ తీసుకెళ్లాక.. ఏం చేయాలో అర్థం కాలేక.. ఏమొస్తే అది చేసి, ఏం అనిపిస్తే అది తీసేశాడు. దాంట్లో కొన్ని నవ్వించాయి. ఇంకొన్ని సాగదీసిన ఫీలింగ్ కలిగించాయి.
ప్రకాష్ రాజ్‌కి `గుండమ్మకథ` లాంటి ఎలివేషన్ ఇచ్చిన దర్శకుడు.. ఆ పాయింట్‌ని సరిగా వాడులేదు. ఎక్కడకక్కడ కొత్త క్యారెక్టరైజేషన్లని పుట్టించాడు కానీ.. దాన్ని సస్టేన్ చేస్తూ, వాటి నుంచి వినోదం పండించలేకపోయాడు. చుట్టూ ఎన్ని పాత్రలున్నా తన బేసిక్ పాయింట్ మాత్రం వెంకీ దగ్గరే ఆగేది. `ఇక్కడో మ్యాజిక్ కావాల్సిందే` అనుకున్నప్పుడు వెన్నెల కిషోర్పాత్రని రంగంలోకి దింపారు. కానీ… దాన్నీ సరిగా వాడుకోలేదు. సినిమా సాగుతోందేంటి? అనే ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా చివర్లో అనసూయని తీసుకొచ్చి ఓ పాటకు స్టెప్పులేయించాడు. బ్రిడ్జ్‌పై తీసిన సీన్… గ్రాఫిక్స్ పరంగా నాశినకంగా ఉండి తేలిపోయింది. ఈ జంటల్ని ఎలాగోలా కలపాలి కాబట్టి.. ఏదో ఒకటి మానేజ్ చేసి థియేటర్ల నుంచి బయటకు పంపించేశాడు.
`సెకండాఫ్ లేకుండానే ఈ సినిమా మొదలెట్టేశాం` అని దిల్ రాజు ఈ మధ్య ఒప్పుకున్నాడు. అందుకే సెకండాఫ్‌లో పట్టు సన్నగిల్లిందేమో అనిపిస్తుంది. ద్వితీయార్థం విషయంలో కూడా కాస్త వళ్లు వంచి, పెన్నుజాడించి.. నాలుగైదు మ్యాజిక్ మూమెంట్స్ రాసుకుని ఉంటే బాగుండేది. అయితే ఫస్టాఫ్ గడిచేసరికే మన డబ్బులకు గిట్టుబాటు అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది కాబట్టి… సర్దుకుపోవొచ్చు.
నటీనటులు
వెంకీని ఇంత జోష్‌గా చూసి చాలా రోజులైంది. తను ఇంతలా నవ్వించి ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. తన బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యే పాత్ర వస్తే ఏం చేయగలడో.. వెంకీ నిరూపించాడు. చుట్టూ ఎన్ని పాత్రలున్నా సెంట్రాఫ్ ఎట్రాక్షన్ వెంకీనే. వయసు పెరుగుతోందన్న మాట కూడా మర్చిపోయి.. వెంకీ పెళ్లి చూపుల సీన్‌నీ, శోభనం సన్నివేశాన్నీ, పెళ్లానికి మల్లెపూలు తీసుకొచ్చినచ సీన్ ని చూసి మురిసిపోతామంటే అదంతా వెంకీ చేసే మ్యాజిక్కే. వరుణ్ కూడా ఏమాత్రం తీసిపోలేదు. తెలంగాణ స్లాంగ్ కాస్త ఇబ్బంది పెట్టిందనిపించింది. తమన్నా గ్లామర్‌తో ఆకట్టుకుంది. తనకీ మంచి పాత్ర దొరికింది. మెహరీన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంతున్న సినిమా ఇదేనేమో. అలా వచ్చి, ఇలా వెళ్లిపోయే మెహరీన్ కాస్త డైలాగులు చెప్పిన సినిమా కూడా ఇదే. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, రఘుబాబు, ఫృథ్వీ.. ఇలా అందరూ నవ్వించడంలో తలా చేయి వేశారు.
సాంకేతిక వర్గం
అనిల్ రావిపూడి పెన్ను పవర్ చూపించిన సినిమా ఇది. సరదా సెటైర్లు బాగా రాసుకున్నాడు. ఎఫ్ 2 అంటే.. ఫన్ అండ్ ఫస్ట్రేషన్… అందులో ఫన్ పార్ట్ వరకూ బాగా చూపించాడు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి గురించి ఇంకా మాట్లాడుకుంటున్నామంటే కారణం.. వినోదం ఒక్కటే కాదు. అందులో బలమైన భావోద్వేగాలు, కథ ఉంటాయి. అవి రెండూ ఈ సినిమాలో మిస్సయ్యాయి. సంగీతం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ పాటల్లో హుషారు, కిక్కు రెండూ మాయమయ్యాయి. విజువల్‌గా గ్రాండ్ లుక్ కనిపించింది.
తీర్పు
సంక్రాంతికి ఇప్పటి వరకూ మూడు సినిమాలొచ్చాయి. అందులో తక్కువ కంప్లైంట్లు ఉన్న సినిమా ఇదొక్కటే. కుటుంబం అంతా కలిసి చూసే లక్షణాలూ ఉన్నాయి. లాజిక్కులు మర్చిపోతే.. హాయిగా నవ్వేసుకుని బయటకు రావొచ్చు.
ఫైనల్ టచ్: ‘ఫన్ అండ్ ఫన్’
రేటింగ్: 2.75