మెగా హీరోలు ప్రెస్ మీట్లు పెట్టినా, ఆడియో ఫంక్షన్లు చేసినా, సినిమాలు చేసినా పవన్ కల్యాణ్ పేరుని ఓసారి మననం చేసుకోవాల్సిందే. లేదంటే మెగా ఫ్యాన్స్‌కి అంత కిక్ రాదు. పవన్‌ని మెగా హీరోల కంటే బయటి హీరోలే ఎక్కువ వాడేస్తుంటారు. అలాంటప్పుడు మెగా హీరోలు వాడుకుంటే తప్పేంటి? అందుకే వరుణ్‌తేజ్ ఇప్పుడు ‘ఎఫ్ 2’లో పవన్ కల్యాణ్‌ని గుర్తు చేయబోతున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్‌తేజ్‌లపై ఓ పాట తెరకెక్కించారు. అందులో వెంకీ, వరుణ్ ఇద్దరూ కూలీల డ్రెస్‌లో కనిపిస్తారు. అందుకు సంబంధించిన స్టిల్ ఇప్పటికే బయటకు వచ్చేసింది. ఈ సందర్భంలోనే వరుణ్ పవన్ కల్యాణ్‌ని గుర్తు చేసేలా మేనరిజమ్స్ ప్రదర్శిస్తాడని తెలిసింది. ఈ విషయాన్ని దిల్ రాజు కూడా సూత ప్రాయంగా ఒప్పుకున్నారు. ”ఓ పాటలో వెంకటేష్ కూలీ నెంబర్ వన్ గెటప్‌లో కనిపిస్తారు. అదే పాటలో వరుణ్‌తేజ్ పవన్‌ని గుర్తు చేసేలా తమ్ముడులో వేసిన డ్రెస్ వేసుకుంటారు” అని చెప్పుకొచ్చారు దిల్‌రాజు. తమ్ముడిలో.. ‘వయ్యారి భామ నీ హంస నడక’ పాట కోసం పవన్ కూలీ అవతారం ఎత్తాడు. ఇప్పుడు అదే గెటప్‌లో కనిపించబోతున్నాడు వరుణ్. అక్కడే… పవన్ మేనరిజాన్ని దింపేయనున్నాడన్నమాట. మరి దీనికి థియేటర్లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలిక.