దర్శకుడిగా అనిల్ రావిపూడి బ్రాండ్ ఏమిటన్నది.. తన మూడు సినిమాల ద్వారా తెలిసిపోయింది. పటాస్. సుప్రీమ్, రాజా ది గ్రేట్‌లలో బాగా నవ్వించేశాడు. అందుకు డబుల్ వినోదం ఇవ్వబోతున్నట్టు `ఎఫ్ 2` టైటిల్ ద్వారానే హింట్ ఇచ్చేశాడు. ఈ సినిమా నిండా నవ్వులే నవ్వులన్న విషయం కొత్త ట్రైలర్ చూసినా అర్థమైపోతోంది. ఈనెల 12న `ఎఫ్ 2` విడుదల అవుతోంది. వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా నటించిన చిత్రమిది. ఈరోజు కొత్త ట్రైలర్ విడుదల చేశారు. భార్యాబాధితులుగా వెంకీ, వరుణ్ మరోసారి చెలరేగిపోయారు. వెంకీ కామెడీ టైమింగ్.. ఓ రేంజులో కనిపించింది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి తరవాత వెంకీ టైమింగ్, గెటప్ అంత బాగా సూటైన సినిమా ఇదేనేమో. అన్నపూర్ణ దగ్గర వెంకటేష్ చెప్పిన డైలాగ్.. ఈ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలుస్తుంది. అనిల్ రావిపూడి సినిమాల్లో కనిపించే విచిత్రమైన మేనరిజాలు, క్యారెక్టరైజేషన్లు… ఈ ట్రైలర్లోనూ కనిపించాయి. కవ్వించాయి. అడుగడుగునా.. నవ్వించాలన్న తపన, సూపర్ కాంబినేషన్, కలర్‌ఫుల్ విజువల్స్.. ఈ సినిమాని నిలబెట్టి తీరతాయన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఈ సంక్రాంతికి రాబోతున్న మిగిలిన సినిమాలకు ఎఫ్ 2 గట్టి పోటీ ఇవ్వబోతోందన్న సంగతి ఈ ట్రైలర్ ద్వారా మరోసారి చాటి చెప్పాడు దిల్‌రాజు.