F3 Telugu Movie Review
తెలుగు360 రేటింగ్ : 3/5
నవ్వించే సినిమాలు ఎప్పుడో కానీ రావు. మేం నవ్విస్తాం అంటూ సినిమాలు తీసే దర్శకనిర్మాతలే కరువయ్యారు. హీరోలు కూడా ఆ కథలకి దూరమవుతూ వస్తున్నారు. కొంతకాలంగా క్రమం తప్పకుండా అనిల్ రావిపూడి నుంచే ఆ తరహా సినిమాలొస్తున్నాయి. ఇంటిల్లిపాదినీ థియేటర్‌కి తీసుకొచ్చే సినిమాలు ఇవే. అందుకే వీటికి ఎప్పుడూ గిరాకీనే. ఈవీవీ, జంధ్యాల సినిమాల్ని ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటున్నామంటే హాస్య ప్రధానమైన సినిమాల బలం అలాంటిది. అనిల్ రావిపూడి `ఎఫ్2`తో ఇంటిల్లిపాదినీ మెప్పించారు. దానికి ఫ్రాంచైజీగా `ఎఫ్3` తీశారు. ఆరంభం నుంచే అందరి దృష్టినీ ఆకర్షిస్తూ వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఎఫ్2 స్థాయిలో నవ్వించిందా లేదా? తదితర విషయాలు తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం…
వెంకీ (వెంకటేష్) ఆలోచనలన్నీ షార్ట్ కట్‌లోనే ఉంటాయి. అతనికున్న సమస్యలు అలాంటివి. షార్ట్‌కట్ సొల్యూషన్స్ అని ఆఫీస్ ఏర్పాటు చేసి ఆర్టీవో ఆఫీసులో బ్రోకర్‌గా పనిచేస్తుంటాడు. వరుణ్ (వరుణ్‌తేజ్) ధనవంతుడు కావాలని కలలు కంటూ ఉంటాడు. ఎవరెవరికో కోట్లు ఇస్తావ్, నాకెందుకు ఇవ్వవ్ అని దేవుడి ముందు మొర పెట్టుకుంటుంటాడు. మరోపక్క హారిక (తమన్నా), హనీ (మెహ్రీన్) కుటుంబం కూడా పలు సమస్యలతో సతమతమవుతూ డబ్బు సంపాదించే పనిలోనే ఉంటుంది. బాగా డబ్బున్న యువతిగా హనీ, డబ్బున్న కుర్రాడిగా వరుణ్ నటిస్తూ ఒకరికొకరు దగ్గరవుతారు. వరుణ్… హనీని పెళ్లి చేసుకుంటే బోలెడంత డబ్బు వస్తుందని ఆశపడిన వెంకీ కూడా అతనికి వత్తాసు పలుకుతాడు. వరుణ్ డబ్బున్న కుర్రాడిగా కనిపించేందుకు బోలెడంత పెట్టుబడి పెడతాడు. ఇల్లు కూడా తాకట్టు పెడతాడు. కానీ ఆ మోసం ఎంతో కాలం దాగదు. దాంతో అందరూ నష్టపోతారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఈసారి వ్యాపారవేత్త ఆనంద్‌ప్రసాద్ (మురళీశర్మ)పై కన్నేస్తారు. చిన్నప్పుడే తప్పిపోయిన తన వారసుడిని వెదికే క్రమంలో ఉన్న ఆనంద్‌ప్రసాద్ ఇంటికి ఈ షార్ట్‌కట్ బ్యాచ్ ఎలా వెళ్లింది? ఆనంద్ప్రసాద్ని ఎలా మభ్యపెట్టింది? కోరుకున్న డబ్బు చేతికొచ్చిందా లేదా? అనేదే మిగతా కథ.
నవ్వుకోవడానికి లాజిక్‌తో పనేముందంటాడు అనిల్ రావిపూడి. `ఎఫ్2` తరహాలోనే మరోసారి ఆ లెక్కలన్నిటినీ పక్కనపెట్టేశాడు. ప్రేక్షకులకి కూడా వాటి గురించి ఆలోచించేంత సమయం ఇవ్వకుండా నవ్వుల బండిని ఎక్స్‌ప్రెస్ వేగంతో నడిపేశాడు. తెలుగుకి విజయవంతంగా ఫ్రాంచైజీని పరిచయం చేస్తూ… చివర్లో మన గమ్యం `ఎఫ్4` అని కూడా చెప్పేశాడు. తొలి సినిమా కథని భార్యభర్తల బంధం చుట్టూ అల్లిన దర్శకుడు… ఈసారి డబ్బు అంశాన్ని ఎంచుకున్నాడు. ఉన్నవాడికి ఫన్… లేనివాడికి ఫ్రస్ర్టేషన్ అనే విషయాన్ని తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశాడు. నిజానికి కథ కంటే కూడా కామెడీ ఎపిసోడ్స్ గురించే ఎక్కువ కసరత్తులు చేశాడు అనిల్. ఇందులో ఉన్నది తెలిసిన కథే. ప్రధానంగా మూడు ట్రాక్‌లు కనిపిస్తాయి. వరుణ్ – హనీల దొంగాట, కమిషనర్ ఇంట్లో రాబరీ, ఆనందప్రసాద్ వారసుడి అన్వేషణ.. ఈ మూడూ కూడా ఇదివరకటి సినిమాల్లో చూసినవే. తెలిసిన ఆ కథపైకి కూడా మనసు వెళ్లనీయకుండా అడుగడుగునా కామెడీ ఎపిసోడ్స్‌తో సినిమాని ప్యాక్ చేసేశాడు దర్శకుడు. అడుగడుగునా ఓ కొత్త పాత్ర వచ్చి నవ్వులు పండిస్తుంటుంది. బోలెడన్ని పాత్రలు పోటీ పడుతుంటే.. మరోపక్క కథానాయకులకి రేచీకటి, నత్తి వంటి సమస్యల్ని జోడించి ఆ నేపథ్యంలోనూ వినోదాన్ని పండించారు.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెంకీ రేచీకటి, వరుణ్ నత్తి హంగామానే. వెంకట్రావు పెళ్లాన్ని చూశా… అంటూ వెంకటేష్ ఎన్నిసార్లు నవ్వించారో. ప్రతిసారీ ఓ కొత్త మేనరిజమ్‌తో నత్తిని ప్రదర్శిస్తూ వరుణ్ కూడా గిలిగింతలు పెడతారు. ఫిట్స్‌తో పాత్రలన్నీ ఒకొక్కటిగా పడిపోయే క్రమంలో బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే పాట కూడా నవ్వించడం ఈ సినిమా ప్రత్యేకత. ద్వితీయార్థంలో కథంతా కూడా ఆనందప్రసాద్ ఇంట్లోనే తిరుగుతుంది. పృథ్వీ గ్యాంగ్‌తోపాటు, పాన్ ఇండియా జూనియర్ ఆర్టిస్ట్ అంటూ వెన్నెల కిషోర్… ఇలా ద్వితీయార్థంలోనూ చివరి వరకు పాత్రలు పోటీ పడుతుంటాయి. వారసుడిని కనిపెట్టేందుకు పరీక్షలు పెట్టడం, ఆ క్రమంలో పండే హాస్యం ఆకట్టుకుంటుంది. అయితే ఉన్నట్టుండి ఫ్యాక్టరీని నిలబెట్టడానికి ఈ గ్యాంగ్ అంతా పూనుకోవడం, అందులో రాత్రికి రాత్రే అద్భుతాలు చోటు చేసుకోవడం సినిమాటిక్‌గా అనిపిస్తుంది. పతాక సన్నివేశాలతో మళ్లీ ట్రాక్ ఎక్కేశాడు దర్శకుడు. పాన్ ఇండియా ఫైట్ అంటూ అక్కడ సాగే హంగామా మరోసారి నవ్వుల్ని పంచింది. మొత్తంగా కథ, లాజిక్ల గురించి పట్టించుకోకుండా ఈ వేసవిలో ఇంటిల్లిపాదీ కలిసి చూసే సినిమా ఇది.
నటీనటుల్లో వెంకటేష్, వరుణ్తేజ్లకే ఎక్కువ మార్కులు పడతాయి. ఇద్దరూ మరోసారి పోటీ పడి నటించారు. వెంకీ ఇమేజ్‌ని పక్కనపెట్టి నటిస్తే, వరుణ్‌తేజ్ రకరకాల మ్యానరిమ్స్తో మంచి టైమింగ్‌ని ప్రదర్శించాడు. తమన్నా, మెహ్రీన్‌ల సందడి ఆకట్టుకుంటుంది. అయితే మెహ్రీన్ మరీ పీలగా మారింది. తమన్నాని కూడా `ఎఫ్2` అంత అందంగా చూపించలేకపోయారు దర్శకుడు. ద్వితీయార్థంలో ఆమె పాత్రలోని డైమన్షన్ ఆశ్చర్యపరుస్తుంది . రాజేంద్రప్రసాద్, సునీల్, రఘుబాబు, అలీ, వెన్నెల కిషోర్, సత్యతోపాటు… `ఎఫ్ 2` ఫ్యామిలీ మరోసారి చేసిన సందడి ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా సినిమా బాగుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం, సాయిశ్రీరామ్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. లబ్ డబ్ పాట మినహా మిగిలిన పాటల చిత్రీకరణే అంతగా మెప్పించదు. అనిల్ రావిపూడి పన్ పవర్ మరోసారి స్పష్టంగా కనిపించింది. ఆయన తన మార్క్ హాస్య సన్నివేశాల్ని రాసుకోవడంలో మరోసారి సక్సెస్ అయ్యారు. కుటుంబమంతా కలిసి చూసేలా స్వచ్ఛమైన కామెడీతో సినిమాని తీర్చిదిద్దడం మెచ్చుకోదగ్గ విషయం. దిల్‌రాజు స్థాయి నిర్మాణం తెరపై కనిపిస్తుంది.
ఒక మామూలు కథని రాసుకుని దాన్ని హాస్యభరితంగా తీర్చిదిద్దడంలో విజయవంతమయ్యాడు దర్శకుడు. నిర్మాతకి పక్కా పైసా వసూల్ సినిమా ఇది. ప్రేక్షకులకూ మంచి కాలక్షేపాన్నిస్తుంది. యాక్షన్ సినిమాలు, హీరోయిజం సినిమాల మధ్య కాస్త ఉపశమనాన్ని కలిగిస్తూ మంచి హాస్యాన్ని పంచే చిత్రమిది.
తెలుగు360 రేటింగ్ : 3/5