పెరిగిన టికెట్ రేట్ల వల్ల… నిర్మాతలకు లాభం కంటే నష్టమే ఎక్కువ అనేది తేలిపోయింది. టికెట్ రేట్లు పెరగడంతో.. థియేటర్లకురావడానికి ఎవరూ ఉత్సాహం చూపించడం లేదన్న సంగతి ఆచార్య లాంటి సినిమాలతో అర్థమైపోయింది. అందుకే `మా సినిమా టికెట్ రేట్లు పెంచడం లేదు.. సాధారణ రేట్లకే టికెట్లు అందుబాటులో ఉంటాయి` అని ప్రకటించడం మొదలైంది. `శేఖర్`కి మామూలు రేట్లే ఉన్నాయి. `ఎఫ్ 3`కీ అంతే. కుటుంబ ప్రేక్షకుల్ని, సగటు ప్రేక్షకుల్నీ దృష్టిలో ఉంచుకునే, టికెట్ రేట్లు పెంచలేదని నిర్మాత దిల్ రాజు చెబుతూ వస్తున్నారు.
టికెట్ రేట్ల పెంపు సగటు ప్రేక్షకుడికి ఇబ్బందిగా మారిందన్నది వాస్తవం. అందులో ఎలాంటి డౌటూ లేదు. కాకపోతే… కలక్షన్లు లేకపోవడానికి అదొక్కటే కారణం కాదు. ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్లకూ టికెట్ రేట్లు పెంచారు. కానీ… ప్రేక్షకులు ఆగారా? వసూళ్లు తగ్గాయా? పెంచిన రేట్లు ఆయా సినిమాలకు మంచే చేసింది. భారీ సినిమాలకు తగ్గట్టుగానే, భారీ వసూళ్లు వచ్చాయి. ఆచార్య విషయానికొస్తే, ఆ రేట్లే కొంప ముంచాయి. ఫస్ట్ షోకే ఫ్లాప్ టాక్ రావడంతో, ఇక తేరుకోలేకపోయింది. పెరిగిన రేట్లు చూసి కొంత, ఆ టాక్ చూసి కొంత.. జనాలు వెనకడుగు వేశారు. దాంతో చిరు సినిమాకి ఎప్పుడూ లేనంత డల్ ఓపెనింగ్స్ వచ్చాయి. `సర్కారు వారి పాట`కూ ఇదే జరిగింది. టాక్ ఆటూ ఇటూ ఉండడంతో.. కుటుంబ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని `ఎఫ్ 3` టికెట్ రేట్ల విషయంలో దిల్ రాజు కఠిన నిర్ణయమే తీసుకొన్నారు. ప్రభుత్వం సూచించిన రేట్లకే టికెట్లు ఉంటాయన్నారు.
సినిమా బాగుంటే, రేట్లు తగ్గాయి కాబట్టి జనాలు థియేటర్లకు వస్తారన్నది దిల్ రాజు ఉద్దేశం. పైగా ఎఫ్ 3 ఫ్యామిలీ ఎంటర్టైనర్. కుటుంబం అంతా కలిసి చూస్తేనే మజా. అలాంటప్పుడు టికెట్ రేట్లు తగ్గినా.. క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది కాబట్టి.. వసూళ్లు గట్టిగా కనిపిస్తాయి. అయితే టికెట్ రేట్లు తగ్గినా, జనాలు థియేటర్లకు రావడానికి ఇష్టం చూపించకపోతే.. అప్పుడు పరిశ్రమ మొత్తం ఆలోచనలో పడాల్సివస్తుంది. ఓటీటీల ఎఫెక్ట్ ఏమేర ఉందో.. ఎఫ్ 3 ఫలితంతో తేలిపోతుంది. టాక్ అటూ ఇటూ అయినా కూడా… మంచి వసూళ్లు వచ్చాయంటే.. టికెట్ రేట్ల ప్రభావం ఉందనుకోవాలి. టాక్ బాగున్నా… జనాలు థియేటర్లకు రాలేదంటే.. ఓటీటీల వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో అర్థమవుతుంది. అసలు జనాలకు థియేటర్లకు వచ్చే ఉత్సాహం ఉందా, లేదా? అనేది తెలుసుకోవడానికి కూడా `ఎఫ్ 3` ఫలితం ఓ కొలమానంగా ఉపయోగపడుతుంది.