దళిత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు యాదగిరి గుట్ట ఆలయంలో అవమానం జరిగిందని బీఆర్ఎస్ నేతలు బాధపడుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. దళితులకు కాంగ్రెస్ అసలు విలువ ఇవ్వడం లేదని.. చిన్న చూపు అని అంటున్నారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఈ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. చివరికి బీఆర్ఎస్తో పొత్తులోకి వెళ్తున్న బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చాలా పెద్ద ట్వీట్ పెట్టారు.. రాహుల్ గాంధీకి ట్యాగ్ చేశారు. కానీ ఇందులో నిజం ఎంత ఉంది ?
ఆలస్యంగా వచ్చిన భట్టి
అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న మంత్రులకు చిన్న పీటలు వేశారు. ముఖ్యమంత్రి దంపతులతో పాటు నల్లగొండ జిల్లా ప్రోటోకాల్ మినిస్టర్స్ కు పీటలు వేశారు. పూజలు జరుగుతున్న సమయంలో ఆలస్యంగా వచ్చారు. అప్పటికే పూజలు జరుగుతున్నాయి అందరూ కూర్చుని ఉన్నారు. డిప్యూటీ సీఎం వచ్చి ఖాళీగా ఉన్న ప్లేస్లో మంత్రి కోమటిరెడ్డి పక్కన కూర్చున్నారు. అందరికీ పీటలున్నాయి.. తనకు లేదని ఆయన అనుకోలేదు. భక్తిపూర్వకంగా కూర్చుని మిగతా పూజలు పూర్తి చేశారు. అయితే ఆ దృశ్యాల్లో అందరూ ఓ అడుగు ఎత్తులో ఉండటం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కింద కూర్చుని ఉండటంతో.. రాజకీయం ప్రారంభమయింది.
డిప్యూటీ సీఎంను అవమానిస్తే రాజకీయంగా లాభం కలుగుతుందా ?
కాంగ్రెస్ నేతలు డిప్యూటీ సీఎంను అవమానించారంటూ బీఆర్ఎస్ పార్టీతో పాటు అనుబంధ నేతలు విమర్శలు ప్రారంభించారు. కానీ భట్టి విక్రమార్కను కావాలని అవమానిస్తే.. రాజకీయంగా మేలు జరుగుతుందా ?. ఆయనను అవమానించాల్సిన అవసరం ఏముంది ?. ఈ రెండు సింపుల్ ప్రశ్నలకు ఆన్సర్ వెదుక్కుంటే.. అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప ఏమీ లేదని అర్థమైపోతుంది. భట్టి విక్రమార్కకు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయినా భట్టి విక్రమార్క విషయంలో బీఆర్ఎస్ ఎక్కువగా కన్సర్న్ తీసుకోవడమే ఆశ్చర్యకరంగా మారిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటున్నాయి.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడూ ఈ తరహా రాజకీయం !
అయితే ఈ రాజకీయం ఒక్క బీఆర్ఎస్ మాత్రమే చేయడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చనిపోయినప్పుడు అధికారిక లాంఛనాలు చేయాలని కేసీఆర్ ఆదేశించినా చేయలేకపోయారు. దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అధికార లాంచనాలు నిర్వహిస్తే కేసీఆర్ కు వచ్చే నష్టమేమీ లేదు.. కానీ ఆయన దళితుల్ని అవమానించారని విమర్శిచారు. అలాగే చాలా ఘటనలు జరిగాయి. భట్టి విక్రమార్క ఘటన కూడా అంతే. దళిత నేతల్ని.. సొంత పార్టీ నేతలు అదీ ముఖ్య స్థానాల్లో ఉన్నవారు బహిరంగంగా కావాలని అవమానించడం అనేది రాజకీయాల్లో ఉండదు. కానీ రాజకీయాలు మాత్రం జరిగిపోతూనే ఉంటాయి.