ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఓ ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. ఆ ఫ్యాక్టరీ వద్దని అక్కడి ప్రజలు ఆర్డీవోను నిర్బంధించడంతో ప్రభుత్వం పనులు ఆపేయాలని ఆదేశించింది. ఆ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని నిర్ణయించింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ ఆ ఫ్యాక్టరీ నిర్వాకం అంతా కాంగ్రెస్ పార్టీదేనని ప్రచారం ప్రారంభించింది. కౌంటర్ గా కాంగ్రెస్ అన్ని అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్సేనని అది తలసాని కుమారుడి కంపెనీ అని ప్రత్యారోపణలు ప్రారంభించారు. అయితే ఇందులో అంతా రాజకీయమే కనిపిస్తోంది. అసలు నిజాలు మాత్రం పాక్షికంగా ఉన్నాయి.
ఆ కంపెనీ తలసాని బంధువులదే- కానీ !
ఆదిలాబాద్ జిల్లాలో నిర్మితమవుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు డైరక్టర్ గా ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది . కానీ తలసాని ఖండించారు. దమ్ముంటే నిరూపిచాలన్నారు. తలసాని చెప్పింది నిజమే. ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని రామ్షై అనే కంపెనీ పేరు మీద నిర్మిస్తున్నారు. ఆ కంపెనీలో డైరక్టర్గా తలసాని సాయికిరణ్ లేరు. కానీ ఈ కంపెనీ పీఎంకే గ్రూపు కింద ఉంది. ఈ గ్రూపుకు చైర్మన్ పుట్టా మహేష్ యాదవ్. ఈయన రాజకీయంగా టీడీపీ ఎంపీ. బంధుత్వ పరంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు. అంటే సాయికిరణ్ బావ. ఈ గ్రూపులో ఉన్న మరో కంపెనీ పీఎంకే డిస్టిలేషన్స్ లో సాయికిరణ్ డైరక్టర్ గా ఉన్నారు. ఈ కంపెనీ లిక్కర్ తయారు చేస్తుంది. అంటే తలసానికి ఆయన కుమారుడు సాంకేతికంగా కంపెనీలో డైరక్టర్ గా లేకపోయినా ఆ గ్రూపులోని ఓ కంపెనీలో డైరక్టర్. అంటే ఇథనాల్ ఫ్యాక్టరీలోనూ ఆయన పాత్ర ఉన్నట్లే అనుకోవచ్చు.
అనుమతులు అన్నీ బీఆర్ఎస్ హయాంలోనే !
ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు వచ్చింది బీఆర్ఎస్ హయాంలోనే. కేంద్రం ఇథనాల్ ను ప్రోత్సహించాలన్న పాలసీలో భాగంగా ఈ కంపెనీ ప్రాజెక్టు చేపట్టింది. పరిశ్రమల ప్రోత్సాహకంలో భాగంగా టీఎస్ఐపాస్లో ఈ కంపెనీకి అనుమతి వచ్చింది. నీటి కేటాయింపులు కూడా జరిగాయి. ఇవన్నీ రహస్యాలేం కాదు. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం తప్పు అని వాదించడం కూడా కరెక్ట్ కాదు.
ఇథనాల్ ఫ్యాక్టరీ చట్టవిరుద్ధమైనది ఏమీకాదు!
ఇథనాల్ ఫ్యాక్టరీ చట్ట విరుద్ధమైనది కాదు. అది బయో ఫ్యూయల్ కంపెనీ. కాలుష్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్మిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అన్ని జాగ్రత్తలతో అన్ని రకాల ప్రభుత్వ ఏజెన్సీల తనిఖీల మధ్యనే నిర్మిస్తున్నామని కంపెనీ చెబుతోంది. ఈ కంపనీ నిర్మాణం వల్ల వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో అనేక మందికి ఉపాధి లభిస్తుంది. కానీ ఇప్పుడీ అంశం రాజకీయంగా మారింది.
ప్రజల్లో ఆపోహలు పెంచి పెట్టుబడుల్ని దూరం చేసుకుంటున్న వైనం !
ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాదు… పెట్టుబడులు వస్తే తమ రాత మారిపోతుందని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పకుండా.. పరిశ్రమలు వస్తున్నాయంటే అధికారంలో ఉన్న వారి దోపిడీ కోసం.. తమ ప్రాంతాన్ని కాలుష్య మయం చేయడానికి వస్తున్నారని ప్రచారం చేసి ప్రజల్నిరెచ్చగొట్టడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీకి ముందు అక్కడిప్ర జలకు అవగాహన కల్పిస్తే సమస్య ఉండేది కాదు. అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు అనుమోలు ఇచ్చిన బీఆర్ఎస్సే అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ రాజకీయం వల్ల ఎక్కువగా నష్టపోతోంది తెలంగాణనే.