టాలీవుడ్ కొత్త జంట నాగచైతన్య – సమంత. సరిగ్గా వారం రోజుల క్రితం హిందూ – క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు పెళ్లి చేసుకొన్నారు. ఆ రెండు రోజులూ మీడియా చేసిన హంగామా ఇంతా అంతా కాదు. ఇప్పటికీ ఆ పెళ్లి ఊసులే. అందులో ఒక వార్త మాత్రం గట్టిగా హల్ చల్ చేస్తోంది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం సమంత – చైలు ఉంగరాలు మార్చుకొన్నారు కదా?? ఆ ఉంగరాల్ని పవన్ , త్రివిక్రమ్‌లు సమంత – చైల పెళ్లికి కానుకగా పంపిన ఉంగరాలట. మిత్ర ద్వయం పవన్ – త్రివిక్రమ్ సరిగ్గా ప్లాన్ చేసి, పెళ్లి రోజున అందేలా ఆ ఉంగరాలు పంపారని, అవి చూసి చై – సమంత షాక్ తిన్నారని, ఆ ఉంగరాలే మార్చుకొన్నారని ఓ వార్త గుప్పుగుప్పుమంటోంది.
అయితే ఈ న్యూస్ లో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది. అసలు చైతన్య – సమంతల పెళ్లికి పవన్, త్రివిక్రమ్‌లు ఎలాంటి కానుకా పంపలేదట. ఇది కేవలం ఫ్యాన్స్ వండిన వార్తే. ఈ విషయంలో త్రివిక్రమ్ సన్నిహితులు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఉంగరాలు మార్చుకోవడం అనేది క్రైస్తవ సంప్రదాయం. తాళికి ఎంత పవిత్రత ఉంటుందో.. ఉంగరాలకూ అంతే ఉంటుంది. అలాంటి ఉంగరాల్ని ఎప్పుడో ఆర్డరు ఇచ్చి చేయించుకొంటారు గానీ… ఇలా గిఫ్టులు పంపిన వాటిని తొడిగేసుకోరుగా. ‘అతడు’ సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పినట్టు ఇంత చిన్న లాజిక్‌ని ఫ్యాన్స్ ఎలా మిస్సయ్యారో…!