వైసీపీ అధికారం కోల్పోయినా..పుంగనూరులో పెద్దిరెడ్డి హవా తగ్గినా ఆయన అనుచరవర్గం మాత్రం ఫ్యాక్షన్ రాజకీయాలను వదిలే ప్రసక్తే లేదన్న తరహలో వ్యవహరిస్తోంది. టీడీపీ సానుభూతిపరులపై దాడికి పాల్పడుతూ భయాందోళనలకు గురి చేస్తోంది. మార్చిలోనే టీడీపీ మద్దతుదారుల ఇళ్లపై దాడి చేసి, హత్య చేసిన ఘటనతో పుంగనూరులో ఫ్యాక్షన్ రాజకీయాలను మళ్లీ తట్టిలేపినట్లు అయింది.
ఈ ఘటన ఇంకా మరవకముందే మరోసారి టీడీపీ సానుభూతిపరులపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. మార్చిలో పెద్దిరెడ్డి అనుచరుల చేతిలో దారుణ హత్యకు గురైన రామకృష్ణకు చెందిన బంధువులపై తాజాగా దాడికి పాల్పడ్డారు. నారాయణస్వామి వర్గం ఈ దాడికి తెగబడినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
ఈ నారాయణస్వామి ఎవరో కాదు.. పుంగనూరులో పెద్దిరెడ్డికి అనుచరుడు. ఆయనే తాజాగా దాడికి పాల్పడిన మూకలకు నాయకుడు అని ఆరోపించారు బాధితులు. వేటకొడవళ్ళతో రామకృష్ణకు చెందిన బంధువులు వెంకటేష్, కన్యాకుమారిలపై దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి.
కొన్నాళ్ళుగా పెద్దిరెడ్డి సైలెంట్ అయినా.. ఆయన అనుచరులు మాత్రం దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ దాడులకు ఆయన అనుచరులే నేతృత్వం వహిస్తుండటంపై టీడీపీ కార్యకర్తలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులకు పెద్దిరెడ్డి ఉసిగోల్పుతున్నాడని ఆరోపిస్తున్నారు.