దేశంలో ఏం మాట్లాడినా తప్పు అయిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొంత మంది బయలుదేరడం… అదే అదనుగా చట్టాలను ఫ్లెక్సీబుల్‌గా మార్చేసుకుని కేసులు పెట్టడం కామన్ అయిపోయింది. దీనికి సాయిపల్లవి ఉదంతమే ఉదాహరణ. ఆమెను ఎలాగోలా వివాదాస్పదం చేయాలన్న ఉద్దేశంలో రూమర్స్ ప్రచారం చేసే యూట్యూబ్ చానల్ చేసిన ప్రయత్నం ఇది. ఆమె తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. ఫలానా వాళ్లది తప్పు అని చెప్పలేమని కూడా చెప్పారు. అయినా తమను వాళ్లతో పోల్చారని.. వీళ్లతో పోల్చారని ఒకటే రచ్చ. ఇలాంటి అభిప్రాయం తీసుకొచ్చింది ఆ ఫేక్ వార్తలు ప్రసారం చేసే యూట్యూబ్ చానల్.
సాయి పల్లవి ఏమన్నదో విన్నవాళ్లు పది శాతం కూడా ఉండరు. కానీ ఆమె క్షమాపణ చెప్పాల్సిందేనని ప్రతి ఒక్కరూ వెంట పడుతున్నారు. అసలు ఏమన్నదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. కొంత మందికి వివాదాలంటే ఇష్టం. తమను ఏదో అన్నారని సెలబ్రిటీలపై పడితే పబ్లిసిటీ వస్తుందని మరికొందరి ప్రయత్నం. ఇలాంటి ప్రయత్నాలకు మీడియా ముసుగులో కొంత మంది ప్రయత్నిస్తూండటం.. చట్టాలపై పోలీసులకు స్ఫష్టమైన అవగాహన ఉంటుందో లేదో తెలియని పరిస్థితులు ఏర్పడటం మరో కారణం.
దేశం వాక్ స్వేచ్చ ఇచ్చింది. తన అభిప్రాయాలను బలంగా చెప్పుకునే అవకాశం ఇచ్చింది. ఇక్కడ సాయి పల్లవి రెబల్‌గా మాట్లాడలేదు. తన అభిప్రాయం చెప్పింది. అదే సమయంలో ఎవర్నీ తప్పు పట్టలేమని కూడా చెప్పింది. అయినా ఆమేదో కాంట్రావర్శీ మాట్లాడారని.. ఆ చానల్ ప్రొజెక్ట్ చేయడం.. ఇతరులు రెచ్చిపోవడం చివరికి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చూస్తూంటే.. ఇక దేశంలో ప్రజాస్వామిక మౌలిక లక్షణాలకూ ప్రమాదం ముంచుకొచ్చేసిందని అనుకోక తప్పదు.