తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులో కారులో పట్టుబడిన రూ. ఐదు కోట్ల వ్యవహారం .. ఏపీలో రాజకీయ అంశంగా మారింది. తమిళనాడు రిజిస్ట్రేషన్‌కు చెందిన ఆ కారుపై ఎమ్మెల్యే బాలినేని స్టిక్కర్ ఉండటం.. అందులో పట్టుబడిన ముగ్గురు ఒంగోలు వాసులు కావడంతో.. ఆ సొమ్ము ఆయనదేనన్న ప్రచారం ఊపందుకుంది. కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉండగా.. డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు దొరికిపోయారు కానీ.. అసలైన ఇద్దరు వ్యక్తులు తప్పించుకున్నారని చెబుతున్నారు. వారిలో ఓ బంగారం వ్యాపారి.. మరో రాజకీయ నాయకుడి కుమారుడు ఉన్నారని అంటున్నారు.
ఒంగోలు నుంచి తీసుకెళ్తున్నారా..? తెస్తున్నారా..?
ప్రకాశం జిల్లా నుంచి చెన్నైకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వాహనాన్ని పోలీసులు చెక్ చేయడంతోనే అసలు విషయం బయటపడింది. వాహనం.. ప్రకాశం జిల్లా నుంచి చెన్నైకి వెళ్తోంది. అంటే.. సొమ్మును ఏపీ నుంచి తమిళనాడుకు తీసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో.. తమిళనాడు నుంచి ఏపీకి తీసుకొస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ.. తీసుకెళ్తున్నారని పోలీసులు చెబుతున్నదాని ప్రకారం తెలుస్తోంది. పెద్ద మొత్తంలో నగదు ఉండటంతో.. ప్రస్తుతం ఆ నగదును ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు. వారు ఆ కారు ఎవరిది.? పట్టుబడిన వారు ఎవరు..? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు లాంటి విషయాలపై కూపీ లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.
అధికార పార్టీకి చెందిన “ఆ బంగారం” వ్యాపారివా..?
ప్రకాశం జిల్లా ఒంగోలులో.. ఏపీ అధికార పార్టీకి చెందిన ఓ బంగారం వ్యాపారిపై… కస్టమ్స్ అధికారులు దాడి చేశారు. ఆయన ఇల్లు, దుకాణాలు.. సన్నిహితుల ఇళ్లల్లో అర్థరాత్రి వరకూ సోదాలు నిర్వహించారు. ఆ సోదాలు నిర్వహిస్తున్న సమయంలోనే.. కారు బయటకు వెళ్లిందని అంటున్నారు. మంత్రి బాలినేని ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించుకుని… దర్జాగా చెన్నై వెళ్లిపోవాలని అనుకుంది. ఆ బంగారం వ్యాపారికి సంబంధించిన వ్యక్తులే కారులో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సొమ్ము ఆయనదే అయి ఉండవచ్చని అంటున్నారు.
తనకేం సంబంధం లేదని తేల్చేసిన మంత్రి బాలినేని..!
తమిళనాడు మీడియా.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సొమ్మేనన్నట్లుగా ప్రచారం చేస్తూండటంతో.. ఆయన ఉలిక్కిపడ్డారు. ఏపీలో అది రాజకీయ సంచలనంగా మారడంతో వివరణ ఇచ్చారు. పట్టుబడిన వారు ఒంగోలుకు చెందిన వారయినంత మాత్రాన.. తనకు సంబంధం అంటగట్టడం సరి కాదన్నారు. ఆ వాహనంతో కానీ.. అందులో పట్టుబడిన సొమ్ముతో కానీ సంబంధం లేదని.. పూర్తిగా విచారణ జరిపి నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కారుకు అంటించిన స్టిక్కర్ కూడా.. జిరాక్స్ అని ఆయన చెబుతున్నారు.
ఎన్నికల సమయంలో ఇలా కోట్లకు కోట్లు పట్టుబడుతూ ఉంటాయి . ఆ కేసులు ఎమవుతాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకపోయినా.. ఇలా కార్లలో గోతాల్లో కోట్లకు కోట్లు తరలిస్తూ దొరికిపోతున్నారు. ఇలాంటి కేసులు అయినా విచారణ దశ దాటి.. నిందితుల వరకూ వస్తాయో రాదో… అంచనా వేయడం కష్టం.
Report from Tamilnadu :
4 Crore cash was seized from a vehicle coming from Ongole , and with AP minister Balineni Srinivasa Reddy’s sticker on it
Police are investigating if the vehicle and cash belong to the minister or not https://t.co/ADqF7LYVCV
— Telugu360 (@Telugu360) July 15, 2020