తెలంగాణలో పెట్టుబడుల వరద అంటూ ఇటీవల విస్తృత ప్రచారం జరుగుతోంది. మంత్రి కేటీఆర్ ప్రతీ వారం ఒప్పందాలు చేసుకుంటూనే ఉంటారు. రూ. 2.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడిని ఆకర్షించామని …లక్షల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించామని చెబుతున్నారు. కానీ అన్నీ ఎంవోయూలే కానీ.. ప్రారంభమవుతున్న పరిశ్రమల గురించి మాత్రం ఎక్కడా ప్రచారం జరగడం లేదు. నిజంగా కేటీఆర్ చెప్పినన్ని పెట్టుబడులు వచ్చాయా అంటే.. అధికారిక లెక్కల్లో ఎక్కడా కనిపించడం లేదు.
తెలంగాణకు 2021-22లో వచ్చిన విదేశీ పెట్టుబడులు రూ. 11965 కోట్లు. అదే పొరుగున ఉన్న కర్ణాటకకు వచ్చినవి 1,63,798 కోట్లు. విధేశీ పెట్టుబడులు అంటేనే అంతర్జాతీయ బ్రాండ్లు పెట్టే పెట్టుబడులని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కర్ణాటక తర్వాత మహారాష్ట్ర, గుజరాత్ , ఢిల్లీ, తమిళనాడులకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వెళ్తున్నాయి. ఆ తర్వాత స్థానంలోనే తెలంగాణ ఉంటోంది ? మరి కేటీఆర్ చెబుతున్న లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి ? ఎవరు పెట్టారు ?. ఇది మాత్రం ఎవరికీ అంతుచిక్కని అంశంగా మారింది.
ఎప్పుడో నాలుగేళ్ల కిందట అదానీ డేటా సెంటర్ అనౌన్స్ చేశారు. కానీ పనులు ప్రారంభం కాలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో మాత్రం అభివృద్ధి కనిపిస్తోంది. కానీ ప్రచారం చేసుకుంటున్నతంగా కాదు. ఇప్పటికైతే తెలంగాణ పెట్టుబడులు 90 శాతం పేపర్ మీదనే ఉన్నాయనుకోవాలి. గ్రౌండ్ అవుతున్న పెట్టుబడులు చాలా స్వల్పం. పెట్టుబడుల ప్రతిపాదనలు వేరు.. ఎంవోయూలు చేసుకోవడం వేరు.. వాటిని గ్రౌండ్ చేసుకోవడం అత్యంత కీలకం. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ వెనుకబడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.