రుషికొండపై సెక్రటేరియట్ కడుతున్నామని వైసీపీ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసుకున్నారు. రాత్రంతా ఉన్న తర్వాత తెల్లవారు జామున బల్బు వెలిగిందేమో కానీ ట్వీట్ డిలీట్ చేసి.. పొరపాటున రాశామని.. వెనక్కి తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. దీంతో అసలు ఓ సందేశాన్ని పంపాలని అనుకుని న్యాయపరమైన చిక్కులు వస్తాయని అలా ట్వీట్ చేశారన్న అనుమానాలు వస్తున్నాయి..
గతంలో బొత్స సత్యనారాయణ అది సీఎం క్యాంప్ ఆఫీస్ అయితే తప్పేంటి అంటూ దబాయించేవారు. కానీ అధికారిక రికార్డుల్లో అది .. టూరిజం ప్రాజెక్ట్. అంతకు ముందు అక్కడ ఉన్న హోటళ్లను కూల్చేసి.. అత్యంత విలాసవంతమైన హోటల్ ను కట్టిస్తున్నారు. అప్పులు కూడ ఆ పేరు మీదనే తెచ్చారు. సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఆ భవనం నిర్మిస్తున్నారని పవన్ ఆరోపించారు. కొండను తొలచడానికే చాలా ఖర్చు అయి ఉంటుందని చెబుతున్నారు.
అయితే అక్కడ నిర్మాణాలేవీ హోటల్ రూపంలో లేవు. మొత్తంగా ఐదు భవనాల వరకూ నిర్మిస్తున్నారు. అందులో ఒకటి ఇంద్రభవనం.. మరో నాలుగు వివిధ భవనాలుగా ఉన్నాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. ఓ అవసరం కోసమే వాటిని నిర్మిస్తున్నారని స్పష్టమవుతోంది. కానీ ఆ భవనాలు ఎందుకో చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రజలకు చెప్పకుండా పరిపాలన చేయడం.. వారికి తెలియనివ్వని పరిపాలన చేయడాన్ని ప్రజలు ఎలా హర్షిస్తారో కానీ.. అదే పాలన వైసీపీ చేస్తోంది.
ఇప్పటికైనా రుషికొండపై కట్టడాలు ఎందుకో ప్రభుత్వం ధైర్యంగా చెప్పాల్సి ఉంది. కానీ అది కూడా చేయలేకపోతోంది. ప్రజల దగ్గర కీలకమైన విషయాలు దాస్తోంది.