ఏపీకి పెద్ద ఎత్తున నిధుల వరద పారుతోందని ప్రచారం జరిగిపోతోంది. కానీ వచ్చిన నిధుల్ని బట్టి చూస్తే అవన్నీ చట్టపరంగా రావాల్సినవే కానీ.. అదనంగా ఇచ్చినవి అతి స్వల్పమని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు పన్నుల్లో వాటా కింద కేంద్రం తెలంగాణ కన్నా ఏపీకి ఎక్కువగా ఇచ్చిదని చెబుతున్నారు. పన్నుల్లో వాటాలను కేంద్ర ఆర్థిక సంఘం డిసైడ్ చేస్తుంది. పైగా ఈ నెల విడుదల చేసిన మొత్తం రెండు నెలల కాలానివి. ఈ నిజం ఎవరూ చెప్పుకోవడం లేదు.
కేంద్ర ప్రాజెక్టులు ఇతర విషయాల్లో కూడా కేంద్రం ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిధుల్లో భాగంగానే ఏపీకి వచ్చాయి కానీ ఏపీకి ప్రత్యేకమైన కేటాయింపు కాదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. వంద శాతం నిధులు భరించాల్సి ఉంది. చేసిన పనులకు తగ్గట్లుగా నిధులివ్వాల్సిదే. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఏపీ పట్ల కనీస బాధ్యతతో వ్యవహరించలేదు కాబట్టి రావాల్సిన నిధురు రాలేదు. పోలవరం, అమరావతి నిర్మాణం ఆపేస్తే నిధులిస్తారా ? రైల్వే ప్రాజెక్టులు, రోడ్లు, కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు కూడా కేటాయించలేదు కాబట్టి ఆ నిధులు కూడా తెచ్చుకోలేకపోయారు. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా పోకుండా తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు ఇప్పటికిప్పుడు ప్రయోజనాలు చూసుకోవడం లేదు. దీర్ఘ కాల ప్రయోజనాలు చూసుకుంటున్నారు. కేంద్రం తరపున పెట్టుబడులు తెస్తున్నారు. బీపీసీఎల్‌తో పాటు బుల్లెట్ ట్రైన్… ఇతర ప్రతిపాదనల్లో ఏపీ ఉండేలా చూసుకుంటున్నారు. అమరావతికి అప్పును ప్రపంచ బ్యాంక్ ద్వారా కేంద్రం ఇప్పిస్తోంది. అంటే అదనంగా వస్తున్న నిధులు పూర్తిగా అడ్మినిస్ట్రేషన్, చంద్రబాబు ప్రయత్నాలు ద్వారానే వస్తున్నాయి.