వాన్పిక్ కేసును కొట్టేశారంటూ ప్రో వైసీపీ మీడియా హడావుడి చేస్తోంది. అసలు అందులో కేసేముందని హైకోర్టు ప్రశ్నించిందంటూ నిమ్మగడ్డకు వాటాలున్న చానల్ 10టీవీ విస్తృతంగా ప్రచారం చేసింది. దానికి తగ్గట్లుగా కొన్ని వైసీపీ అనుకూల చానళ్లుఅదే కథనాన్ని ప్రసారం చేశాయి. అసలు నిజం ఏమిటంటే వాన్ పిక్ క్విడ్ ప్రో కేసును కొట్టేయలేదు. ఈ కేసులో నిందితుల జాబితాలో ఉన్న వాన్ పిక్ ప్రాజెక్ట్ కంపెనీ పేరును మాత్రం తొలగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ సంస్థ చైర్మన్ నిందితుడిగా ఉన్నారని.. ఇలాంటి సమయంలో ఆ కారణంగా వాన్ పిక్ కంపెనీని నిందితుల జాబితాలో ఉంచలేమని.. సాంకేతిక కారణాలతో వాన్ పిక్ కంపెనీ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు అనుమతించి తొలగించింది. అంతే కానీ కేసు మొత్తాన్ని కొట్టి వేయలేదు. ఇప్పటికే ఈ అంశంపై ఏపీ సీఎం జగనమోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ సహా వాన్ పిక్ స్కాంలో ఉన్న వారందరిపై విచారణ కొనసాగుతుంది.
క్వాష్ పిటిషన్లను మాత్రం హైకోర్టు పరిష్కరిస్తోంది. తమపై దాఖలైన సీబీఐ కేసుల్లో వందల పిటిషన్లు వేసి విచారణను ఆలస్యం చేస్తున్న నిందితులు ఇప్పటికీ అదే వ్యూహం అవలంభిస్తున్నారు. కోర్టులో ఏ చిన్న ఊరటలభించిన తమపై కేసులు కొట్టి వేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న వారి చేతుల్లో ఇప్పుడు మీడియా సంస్థలు ఉన్నాయి. వారు అధికారంలో ఉన్నారు. ఈ కారణంగా కోర్టు తీర్పులకూ వక్రభాష్యాలు చెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.