హెచ్ఎంపీవీ వైరస్ పేరుతో ప్రజలందర్నీ హోల్‌సేల్‌గా భయపెట్టడం ప్రారంభమయింది. నిజానికి ఆ వైరస్ ప్రాణాంతం కాదని సాధారణ ఫ్లూ లాంటిదేనని అందరూ చెబుతున్నారు. వైద్యనిపుణులు కూడా చెబుతున్నారు. అది కరోనా తరహాలో కొత్త వైరస్ కాదని కూడా చెబుతున్నారు. కానీ ప్రజలు నిజాలను నమ్మడానికన్నా.. అవాస్తవాలను నమ్మి భయటడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా దేశంలో పానిక్ ఏర్పడుతోంది.
కేంద్రం ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ కొత్తది కాదని భయడాల్సిన పని లేదని స్పష్టం చేసింది. అంతగా భయం ఉంటే మాస్క్ వేసుకుని ఎవరి పనులు వాళ్లుచేసుకోమని సలహా ఇస్తోంది. అన్ని ప్రభుత్వాలూ అదే చెబుతున్నాయి. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు ఈ వైరస్ వస్తే సాధారణ లక్షణాలే ఉంటాయి. చికిత్సకు వేరే మందు లేదు.దానంతటకు అదే తగ్గిపోతుంది. పైగా ఈ వైరస్ సోకి చనిపోతారన్న దానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. అయినా ప్రజల్లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఏవో దాచి పెడుతున్నాయని వారు అనుకుంటున్నారు.
కరోనా కారణంగా ప్రజల్లో ఓ రకమైన భయం ఏర్పడింది. వైరస్ అంటే.. చచ్చిపోవడమే అనుకుంటున్నారు. అన్నింటికీ మించి ఆ వైరస్ సోకితే ఏదో జరిగిపోతుందన్న ప్రచారం.. వైద్యం కూడా అందదన్న భయం ప్రజల్లో ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కరోనా తర్వాత కరోనాపేరుతోనే కొత్త వేరియంట్ అంటూ ఎన్నో సార్లు భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు పట్టించుకోలేదు. ఈ కొత్త వైరస్ కొత్త ప్రయత్నం జరుగుతోంది. ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉంటే చాలు. లేకపోతే మెడికల్ మాఫియా అడ్డగోలుగా దోచేస్తుంది.