మహారాష్ట్ర మాజీ సీఎం మొత్తం కథ నడిపి చివరికి జోకర్‌గా మిగిలిపోయారు. ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. మహారాష్ట్ర బీజేపీకి తిరుగులేని నేతగా ఉన్న ఆయన… మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కర్త, కర్మ, క్రియ కూడా. అయితే ఆయనకు దక్కింది మాత్రం డిప్యూటీ సీఎం పదవి. అదే ఆయనకు మొదటి పదవి అయితే సరే అనుకోవచ్చు..కానీ ఐదేళ్లు సీఎంగా చేసి.. తన మంత్రివర్గంలో జూనియర్ మంత్రిగా పని చేసిన షిండే కింద డిప్యూటీగా చేయాల్సి వస్తోంది.
గవర్నర్‌ను కలిసిన తర్వాత సీన్ మారిపోయింది. ఏక్నాథ్ షిండేను సీఎంగా ఫడ్నవీస్ స్వయంగా ప్రకటించారు. అయితే తాను మంత్రివర్గంలో ఉండనని ఆయన చెప్పారు. బీజేపీ బయట నుంచి మద్దతు ఇస్తుందని చెప్పుకున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ ఫడ్నవీస్ ను డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన డిమోషన్ కింద ప్రమాణం చేయక తప్పలేదు. నిజానికి గత రెండున్నరేళ్లుగా మహావికాస్ ఆఘాడీపై దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ పోరాడుతోంది. రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోనే విజయాలు సాధించారు. ఏక్నాథ్ షిండేను కూడా తిరుగుబాటుకు మోటివేట్ చేసింది ఫడ్నవీసేనని చెబుతారు. మళ్లీ సీఎం అవ్వాలని ఆయన అనుకున్నారు.. అవుతానని అనుకున్నారు. కానీ కథ మాత్రం అడ్డం తిరిగింది.
గతంలో బీజేపీ- శివసేన ప్రభుత్వంలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏక్ నాథ్ షిండే మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు శివసేన చీలిక వర్గం- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఏక్ నాథ్ షిండే సీఎం … ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. అదే సమయంలో ఓ సారి ముఖ్యమంత్రిగా చేసి.. మళ్లీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టినవారు తక్కువే. తనకు పదవి వద్దని ఫడ్నవీస్ ప్రకటించారు. తాను ప్రభుత్వానికి దూరంగా ఉంటానన్నారు. కానీ బీజేపీ హైకమాండ్ ఆదేశంతో ఆయన తక్కువ స్థాయి పదవి చేపట్టక తప్పలేదు.