అనుకొన్నట్టే ‘పుష్ఫ 2’ వాయిదా పడింది. ఈ సినిమా ఆలస్యం అవ్వడం వల్ల నిర్మాతలపై దాదాపు రూ.40 కోట్లు అదనపు భారం పడబోతోంది. సినిమా హిట్టయి, జోరుగా లాభాలొస్తే ఈ రూ.40 కోట్లు పెద్ద లెక్క కాదు. కానీ ఫలితంలో తేడా వస్తే.. ఇలాంటి మొత్తాలే నిర్మాతల తలరాతల్ని మార్చేస్తాయి. ఈ రూ.40 కోట్ల భారాన్ని ఎవరు భరిస్తారు? బన్నీ, సుకుమార్ తలో చేయి వేసి, పారితోషికాల్లో కొంత మొత్తం వెనక్కి ఇస్తారా అనే చర్చ మొదలైంది. అంతకంటే ముందు… అసలు ఈ ఆలస్యానికి కారణం ఎవరు? అనే దిశగా ఆలోచిస్తే ఫహద్ ఫాజల్ పేరు బయటకు వస్తుంది.
ఫహద్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. పుష్ష1 క్లైమాక్స్ వరకూ ఫహద్ ఎంట్రీ లేదు. కానీ క్లైమాక్స్ నుంచి ఫహద్ చుట్టూనే కథ తిరుగుతుంది. సెకండ్ పార్ట్ లో కూడా ఫహద్ పాత్రే కీలకం. జనవరి, ఫిబ్రవరి మధ్యలో ఫహద్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించాల్సివుంది. ఆ రెండు నెలలూ ఫహద్ కాల్షీట్లు బ్లాక్ చేశారు కూడా. ఫహద్ కూడా ఏ సినిమాల్నీ ఒప్పుకోకుండా పుష్ష 2 కోసం కాచుకొని కూర్చున్నాడు. ఇంతలో సుకుమార్ గేమ్ ఫ్లాన్ మారింది. షెడ్యూల్ లో మార్పుల వల్ల ఫహద్ డేట్లు వృధా అయ్యాయి. దాంతో పుష్ష టీమ్ పై ఫహద్ కు కోపం వచ్చిందని, తాన డేట్లు బ్లాక్ చేసి, వాడుకోకుండా కొత్తగా మళ్లీ డేట్లు అడిగితే ఈగో ఫీలయ్యాడని, ఆ పంతంతోనే ‘పుష్ష’కు అవసరమైనప్పుడు డేట్లు ఇవ్వలేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘పుష్ష’ ఒప్పుకొనేటప్పుడు కూడా ఈ సినిమా రెండు భాగాలుగా తీస్తారన్న సంగతి ఫహద్‌కు చెప్పలేదట. పార్ట్ 1లో తన పాత్ర క్లైమాక్స్‌కు పరిమితమైన విషయంలోనూ ఫహద్ గుర్రుగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని పరోక్షంగా ఓ ఇంటర్వ్యూలో కూడా బయట పెట్టాడు. పుష్ష తో తన కెరీర్‌కు ఒరిగిందేం లేదని, అంతకు ముందే తను పాపులర్ నటుడని, తన దృష్టి మలయాళం మీదే అని.. గట్టిగా చెప్పాడు. ఈ కోపంతోనే.. పుష్ష 2 డేట్ల విషయంలో నిర్మాతల్ని ఇబ్బంది పెట్టాడని తెలుస్తోంది. నిజానికి జూన్ మొదటి వారంలో ఫహద్ మళ్లీ కొన్ని డేట్లు కేటాయించాడు. కానీ చివరి నిమిషంలో కాన్సిల్ చేశాడని తెలుస్తోంది. దాంతో పుష్షని వాయిదా వేయక తప్పలేదు.