రిలీజ్‌కి ముందు పుష్ప ప్రమోషన్లు నత్తనడకన సాగాయి. హిందీలో ఈ సినిమా వెళ్లిందన్న పేరుకు గానీ, అక్కడ చేసింది అరా కొర ప్రమోషన్లే. అయినా సరే.. బాలీవుడ్ లో మంచి వసూళ్లే అందుకుంది పుష్ప. రిలీజ్ అయ్యాక… తెలుగుతో పాటు, మిగిలిన చోట్లా… విరివిగా ప్రమోషన్లు చేశారు. థ్యాంక్స్ మీట్లు పెడుతూనే ఉన్నారు. ఈ ఈవెంట్లకు దాదాపు నటీనటులు, సాంకేతిక నిపుణులంతా హాజరయ్యారు. కనిపించనిది ఒక్కరే.. ఫహద్ ఫాజిల్.
ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్.. పాత్రలో మెరిశాడు ఫహద్ ఫాజిల్. పార్ట్ 1లో కనిపించేది కాసేపే. కానీ పార్ట్ 2లో పుష్ప యుద్ధం అంతా భన్వర్తోనే. పుష్ప సెంట్రాఫ్ అట్రాక్షన్స్ లో ఫాజిల్ ఒకడు. పుష్పలో తను ఉన్నాడన్న వార్త దగ్గర్నుంచి ఈ సినిమా క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఈ సినిమా కోసం ఫాజిల్ కి భారీ పారితోషికం ఇచ్చి మరీ తెచ్చుకున్నారు. ఓ తెలుగు సినిమాలో ఫాజిల్ నటించడం కూడా ఇదే తొలిసారి. అయినా సరే, తను ఈ సినిమా ప్రమోషన్లలో ఎక్కడా కనిపించలేదు. ప్రి రిలీజ్‌కి గానీ, ఆ తరవాత జరిగిన థ్యాంక్స్ మీట్లకు గానీ, తను హాజరు కాలేదు.
ఫాజిల్ రాకపోవడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి… ఫాజిల్ కి ప్రచారం అంటే గిట్టదు. తనని ప్రమోషనకు తీసుకురావడం నిర్మాతలకు చాలా చాలా కష్టం. ఒకవేళ ప్రమోషన్లకు వస్తే… దానికి వేరే ప్యాకేజీ ఇవ్వాలి. రెండు రోజులు ప్రమోషన్లకు రావాలనుకుంటే, తన రెండు రోజుల పారితోషికం ఇవ్వాల్సిందే. ఫాజిల్ కి భారీ పారితోషికం ఇచ్చిన మైత్రీ మూవీస్ కి మరో రెండు రోజుల పారితోషికం ఇవ్వడం పెద్ద మేటరేం కాదు. కాకపోతే… ఫాజల్ అవసరం పార్ట్ 1 కంటే, పార్ట్ 2కే చాలా ఎక్కువ. అందుకే.. ఫాజిల్ ని పార్ట్ 2 టైమ్ లో రంగంలోకి దింపాలన్నది ఆలోచన. అందుకే ఫాజిల్ రాకపోయినా సరే, పుష్ప బృందం లైట్ తీసుకుంది.