విశ్వవిద్యాలయాల వివాదంపై కేంద్రాన్ని, బీజేపీని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ వేసిన స్కెచ్ ఫలించినట్టు లేదు. హైదరాబాదు విద్యార్థి రోహిత్ ఆత్మహత్య, ఢిల్లీ జె ఎన్ యులో జాతి వ్యతిరేక కార్యకలాపాల వివాదంపై మోడీ ప్రభుత్వాన్ని ఊపిరి సలపనంతగా దుయ్యబట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. కానీ అధికార పక్షం ఎదురుదాడి ముందు కాంగ్రెస్ పార్టీ తేలిపోయినట్టు కనిపించింది. ఇరు పక్షాల వారూ పక్కా ప్లానింగ్ తోనే సభా సమరానికి రెడీ అయ్యారు. కానీ కమలనాథులదే పైచేయిగా కనిపించింది.
ఈ అంశంపై చర్చ మొదట్లో కాంగ్రెస్ వారి దాడి వాడిగానే కనిపించింది. జ్యోతిరాదిత్య సిందియా ఆవేశంగానే బీజేపీపై దాడి చేశారు. బీజేపీ నాయకుల ప్రకటనలు, గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ భీకరంగానే అటాక్ చేశారు. దీంతో బీజేపీ వారు అనేక సార్లు నినాదాలతో ఆయనకు అడ్డు తగిలారు. మొత్తం మీద సిందియా ప్రసంగం రాహుల్ గాంధీ చేసే ప్రసంగాలకంటే చాలా మెరుగనిపించింది.
బీజేపీ ఈసారి ముమ్మరంగా గ్రౌండ్ వర్క్ చేసినట్టు వారి ప్రసంగాలను బట్టి అర్థమవుతుంది. అనురాగ్ ఠాకూర్ మాట్లాడిన తీరు చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఆయన రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు మొత్తం కాంగ్రెస్ పార్టీపైనా భీకరమైన దాడి చేశారు. పార్లమెంటు సభ్యుడై ఉండి, పార్లమెంటుపై దాడికి సూత్రధారి అయిన అఫ్జల్ గురును సమర్థించిన వారితోభుజం భుజం రాసుకుని తిరిగారంటూ రాహుల్ పై ఘాటు విమర్శలు చేశారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ అయిన డిఎస్ యు విద్యార్థులతో జెఎన్ యులో పక్కపక్కనే కూర్చోవడం ఏం పద్ధతని రాహుల్ ను నిలదీశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్ల ఇంటికి రాహుల్ గాంధీ వెళ్లలేదని గుర్తు చేశారు. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వెళ్తారనే అర్థం వచ్చేలా ఆరోపణలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహుల వైపు ఉంటుందా, దేశభక్తుల వైపు ఉంటుందా ఆలోచించాలని సవాలు విసిరారు. చివరగా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన ప్రసంగం కాంగ్రెస్ వారిని పూర్తి డిఫెన్సులో పడేసింది. ఏయే ఎంపీ ఎన్నిసార్లు ఉత్తరాలు రాశారనే దగ్గరి నుంచి రోహిత్ అంశం, జెఎన్ యులో విద్యార్థి సంఘాల వెనుక మతలబులు ఏకరువు పెట్టారు. తన డ్యూటీ తాను చేసినందుకు తనను ఉరికంబం ఎక్కించే ప్రయత్నం జరుగుతోందని, తాను బెదిరేది లేదని చెప్పారు. విధిని సరిగా నిర్వర్తించినందుకు తాను క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదని తేల్చేశారు. ఆవేశంగా, భావోద్వేగంతో, ఆమె ప్రసంగించిన తీరు, పక్కా ప్లానింగ్ కు అద్దం పట్టింది. అమేథీలో తనకు ప్రత్యర్థిగా మారుతున్న స్మృతి ఇరానీని వీలైనంతగా ఇరుకున పెట్టాలని రాహుల్ గాంధీ చేసే ప్రయత్నాలు తరచూ విఫలమవుతున్నాయి. ఇప్పుడు కూడా ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో పూర్తి పైచేయి సాధించలేక పోయింది. స్మృతి ఇరానీ వన్ వుమన్ షోగా ఈ చర్చ ముగియడం గమనార్హం.