థియేటర్‌కి ఓటీటీ వేదిక ప్రత్యామ్నాయం అవుతుందని భావిస్తున్న తరుణంలో వరుస పరాజయాలు ఓటీటీని ఉక్కిరి బిక్కిరి చేశాయి. థియేటర్లు మూతబడిన తరవాత నిర్మాతల చూపులన్నీ ఓటీటీపై పడ్డాయి. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో లెక్కకు మించిన సినిమాలు విడుదలయ్యాయి. హిందీ నుంచే పది సినిమాలు వచ్చాయి. తెలుగు నుంచి ‘పెంగ్విన్’, ’47 డేస్’, ‘అమృతరామమ్’ లాంటి సినిమాలు విడుదలయ్యాయి. కానా ఒక్కటీ హిట్ అవ్వలేదు. ఆర్జీవీ అయితే… ఏకంగా రెండు సినిమాల్ని పే పర్ వ్యూ పద్ధతిన రిలీజ్ చేశాడు. కానీ.. అవి రెండూ సీ గ్రేడ్ సినిమాల లిస్టులో చేర్చేశారు సినీ జనాలు.
ఓటీటీలో వరుసగా ఫ్లాపులు దర్శనమివ్వడంతో… ఓ నెగిటీవ్ వైబ్రేషన్ మొదలైంది. ఓటీటీ విడుదల అంటే ఫ్లాపు సినిమానే అనే ముద్ర పడిపోయింది. థియేటర్లు లేక, బయ్యర్లు లేక, విలవిలలాడుతున్న సినిమాలే ఓటీటీలోకి వస్తాయన్న భావన కలిగింది. అయితే.. వారం రోజుల వ్యవధిలో రెండు చిన్న సినిమాలు ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకుల ఆదరణ సంపాదించాయి. అవే.. కృష్ణ అండ్ హిజ్ లీల, భానుమతి & రామకృష్ణ.
కృష్ణ అండ్ హిజ్ లీల ముందు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, ఇప్పుడు ఆహాలోనూ స్ట్రీమింగ్ అవ్వబోతోంది. భానుమతి & రామకృష్ణ ఆహాలోకి వచ్చింది. రెండూ ప్రేమకథలే. సున్నితమైన భావోద్వేగాలతో ఆకట్టుకున్నాయి.తక్కువ బడ్జెట్లో తయారవ్వడం వీటి ప్లస్ పాయింట్. నిడివి పరంగా చూసినా చిన్న సినిమాలే. వీటికి ఎంత రేటు ఇచ్చారో, నిర్మాతలు ఎంత లాభపడ్డారో తెలీదు గానీ, సినిమాల్లేక విలవిలలాడుతున్న ప్రేక్షకులకు మాత్రం మంచి కాలక్షేపం అయిపోయింది. ఈ రెండు చిత్రాలూ.. ఓటీటీ వేదికకు ఓదార్పు విజయాలు అందించాయి. ఓటీటీలోనూ మంచి సినిమాలు చూడొచ్చన్న నమ్మకాన్ని కలిగించాయి. చిన్న సినిమాలకు ఈ హిట్స్ కొండంత భరోసానీ, ఆసరానీ అందించాయి. ఈ విజయ పరంపర ఇంకొన్ని సినిమాల పాటు కొనసాగితే – థియేటర్లు లేని లోటు కొంత వరకూ తీరుతుంది.