రాజకీయ పార్టీలు సోషల్ మీడియా గెలిపుస్తుందని ఆశలు పెట్టుకున్నాయి. అక్కడ ప్రత్యర్థి పార్టీలపై తప్పుడు ప్రచారాలు చేస్తే.. ప్రజలు నమ్మేసి గెలిపిస్తారని అంచనా వేసుకుని ఆ ప్రకారం రంగంలోకి దిగిపోతున్నారు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఇలాంటి ప్రచారంలో ఆరితేరిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా బీజేపీకి కౌంటర్ ఇవ్వడానికి టీఆర్ఎస్ కూడా ఇలాంటి ప్రచారమే ప్రారంభించిందనే విమర్శలు ఎదుర్కొంటోంది. వరద సాయం విషయంలో ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఆన్లైన్లో విమర్శల యుద్ధం నడుస్తోంది.
హైదరాబాద్లో నాలుగు రోజుల నుంచి ఈ సేవా కేంద్రాల వద్ద రద్దీ బుధవారం మరింత ఎక్కువగా కనిపించింది. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనంత భారీ సంఖ్యలో బాధితులు .. వరద సాయం కోసం తమ పేర్లను నమోదు చేయించుకునేందుకు వచ్చారు. అయితే మధ్యాహ్నానికి ఈసేవల్లో అన్ని సర్వర్లు డౌన్ అయ్యాయి. వరద సాయం కోసం రిజిస్ట్రేషన్ చేసే ఆప్షన్ డిసేబుల్ అయిపోయింది. ఆ తర్వాత కాసేపటికి… రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఓ ప్రకటన విడుదలయింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.. వరద సాయం రిజిస్ట్రేషన్, పంపిణీ నిలిపివేయాలనేది ఆ ప్రకటన సారాంశం. బీజేపీ ఫిర్యాదు వల్లే… ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని.. పేదల పొట్ట కొట్టారని టీఆర్ఎస్ ఆరోపణలు ప్రారంభించింది. వెంటనే.. టీఆర్ఎస్ నేతలు.. ఈ అంశం ఆధారంగా.. బీజేపీపై విరుచుకుపడటం ప్రారంభించారు. సోషల్ మీడియాలో బండి సంజయ్ రాసిన లేఖ అంటూ ప్రచారంలో పెట్టారు.
కేసీఆర్ ఆరోపణలపై బండి సంజయ్ వెంటనే స్పందించారు. తతాను ఈసీకి ఎలాంటి లేఖ రాయలేదని స్పష్టం చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు అత్యాత్సాహంతో బండి సంజయ్ లేఖ అంటూ ప్రచారం చేయడం.. వివాదాస్పదం అవుతోంది. ఆ లేఖలో బండి సంజయ్ సంతకం ఫోర్జరీ చేయడమే కాదు..అసలు ఆ లేఖే ఫేక్ అని స్పష్టంగా తెలిసేలా ఉందంటున్నారు. గ్రేటర్ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతాయి. బండి సంజయ్ రాసినట్లుగా చెబుతున్న లేఖలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి రాసినట్లుగా ఉంది. వరద సాయం ఆపాలన్న ఆదేశాలు.. ఎస్ఈసీనే ఇచ్చింది. బండి సంజయ్.. ఢిల్లీ ఈసీకి ఎందుకు లేఖ రాస్తారనే ప్రశ్న మౌలికంగా వస్తుంది. దీన్నే బీజేపీ నేతలు.. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ ఫేక్ ప్రచారాలకు పాల్పడుతోందంటున్నారు.
నిజమో.. అబద్దమో.. ముందు ఓ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆత్రం.. ప్రత్యర్థి పార్టీలపై ఆగ్రహాన్ని ప్రజల్లో కల్పించాలన్న ఆత్రం మాత్రం.. రాజకీయ పార్టీల్లో కనిపిస్తోంది. ఇలాంటి ప్రచారాలు ఫలితాలిచ్చాయని… నమ్మకం కలుగుతూండటంతో.. తమ శక్తి మేర.. ఆన్ లైన్ ప్రచారంపై దృష్టి పెడుతున్నారు.