ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ వివాదాలు .. ప్రభుత్వ అప్పులకు తోడు కొత్తగా వెలుగు చూసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల స్కాం కలకలం రేపుతోంది. అసలే ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయిందని పెద్దలు కిందా మీదా పడి అప్పులు చేస్తూంటే దొరికిందే సందు అనుకుని సబ్ రిజిస్ట్రార్లు పెద్దఎత్తున ప్రభుత్వ ఖజానాకు టెండర్ పెట్టేశారు. సీఎంఎఫ్ఎస్ విధానంలో కొత్త ప్రభుత్వం తీసుకు వచ్చిన కొన్ని మార్పుల్లో లొసుగులను ఆధారంగా చేసుకుని సబ్ రిజిస్ట్రార్లు ఒక దానికి వాడేసినచలాన్ను మరోదానికి వాడేస్తూ.. డబ్బులు వెనుకేసుకోవడం ప్రారంభించారు. చివరికి బయటపడింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోనే ఈ స్కాం మూలాలు వెలుగు చూశాయి.
ఆ తర్వాత కృష్ణ జిల్లాలోనూ బయటపడ్డాయి. తీగ లాగితే డొంకంతా బయటపడినట్లుగా ఉండటంతో… శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. ఇప్పటి వరకూ పరిశీలించిన రిజిస్ట్రేషన్ డాక్యు్మెంట్లలో 770 వరకూ నకిలీ చలాన్లతో రిజిస్ట్రేషన్ చేసినట్లుగా గుర్తించారు. ఈ అక్రమాల ద్వారా రూ. ఐదు కోట్ల ప్రజాధనం అధికారుల జేబుల్లోకి వెళ్లిందని రికవరీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే అంత కొద్ది మొత్తానికే ఇంత హడావుడి చేయాల్సిన అవసరం లేదని… ఇది అంతకు మించిన స్కాం అన్న అభిప్రాయాలు మాత్రం నిపుణుల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశారు. ఈ కేసును సీఐడీకి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగాలేదు.
అంత ప్రాధాన్యం లేదనుకున్నారేమో కానీ.,. పోలీసుల విచారణ సరిపోతుందని రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అంటేనే .. అవినీతికి కేంద్రాలన్న ఆరోపణలు ఉన్నాయి. లంచాలు.. భూముల అవకవతకలకు తోడు.. ఇప్పుడు నేరుగా ప్రభుత్వ ఖజానానే కొల్లగొట్టేందుకు సబ్ రిజిస్ట్రార్లు వెనుక అడుగు వేయకపోవడం… కలకలం రేపుతోంది. ప్రభుత్వం పరువు పోతుందని ఈ స్కాంను తొక్కి పెడితే అది భవిష్యత్‌లో చాలా పెద్ద డ్యామేజ్‌కు కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.