హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి. అసలు ప్రచారం చేయడం కన్నా.. ప్రత్యర్థులపై ఫేక్ ప్రచారాలు చేయడానికి ఎక్కువసమయం కేటాయిస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అనేకానేక పోస్టులు పుట్టుకొస్తున్నాయి. ఎక్కువగా ఈటల రాజేందర్‌ను కార్నర్ చేసేవిగానే ఉన్నాయి. మొదట్లో.. ఈటల రాజేందర్ తాను తప్పు చేశానని… క్షమించాలని కేసీఆర్‌కు రాసిననట్లుగాఓ లేఖను వైరల్ చేశారు. దానిపై ఆయన పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
తాజాగా.. ఈటల బావమరిది దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను విస్తృతంగా వైరల్ చేశారు. వెంటనే టీఆర్ఎస్ నేతలు ఈటల దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఇదేదో ప్లాన్ ప్రకారమే చేస్తున్నారనిట్లు.. ఫేక్ వార్తలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఈటల భార్య జమున.. హుజూరాబాద్ లో ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అక్కడకు టీఆర్ఎస్ నేతలు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ స్క్రీన్ షాట్లు ఎవరివి.. ఎవరు చాట్ చేశారు.. ఎవరి పేరు మీద ప్రచారం చేశారన్నది మాత్రం బయటకు రాలేదు.
ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ తరహా ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పాత వీడియోలతో డబ్బులు.. వస్తువులు పంచుతున్నారని కొంత మంది.. నేతల్ని గ్రామస్తులు తరిమికొడుతున్నారని మరికొందరు వీడియోలు పెడుతున్నారు. ఇక ఆడియోలకయితే లెక్కలేదు. ఇలాంటి స్క్రిట్లతో హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పటికే… ఔరా అనుకునేలా మారిపోయింది. ముందు ముందు ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడం కష్టమేనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.