హైదరాబాద్: చెన్నై వరద బాధితులకు సూపర్స్టార్ల విరాళాల విషయంలో పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఏ ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఇలా జరగలేదు. మరి ఈ సారి మాత్రం ఎందుకనో నిజాలకంటే పుకార్లే బలంగా వినిపిస్తున్నాయి.
తమిళ నటుడు విజయ్‌తో ఇది ప్రారంభమయింది. విజయ్ చెన్నై వరద బాధితులకు రు.5 కోట్లు విరాళం ప్రకటించినట్లు వార్తలొచ్చాయి. చాలా వెబ్ సైట్లు ఈ వార్తను పెట్టాయి. అయితే దీనిలో నిజం లేదని పక్కాగా తేలింది. విజయ్ అభిమానులెవరో అత్యుత్సాహంతో ఈ వార్తను సోషల్ మీడియాలో చొప్పించారు. విజయ్ అసలే ‘పులి’ చిత్రం తీసి పీకల్లోతు నష్టాలలో మునిగిపోయి ఉంటే రు.5 కోట్లు ఎలా ఇస్తాడు… ఈ వార్తను ఇచ్చిన వెబ్ సైట్లు ఆ మాత్రమైనా ఆలోచించాలి కదా! అయినా విజయ్ ట్విట్టర్ ఎకౌంట్ చూసినా వారికి తెలిసిపోతుంది. రు.5 కోట్లు విరాళం ఇస్తే దానిలో తప్పనిసరిగా ప్రకటిస్తాడు కదా!
ఇక ఆ తర్వాత రజనీకాంత్ వంతు. రజనీ వరద బాధితులకు మొదటే రు.10 లక్షల విరాళం ప్రకటించాడు. అయితే పక్క రాష్టంలోని అల్లు అర్జున్ లాంటి జూనియర్ స్టార్ హీరోలే రు.25 లక్షలు ఇస్తుంటే తమ సూపర్ స్టార్ రు.10 లక్షలు ఇవ్వటం ఏమిటనుకున్నారో, ఏమో రజనీ అభిమానులెవరో కొత్త పుకారు పుట్టించారు… రజనీ మళ్ళీ రు.10 కోట్లు విరాళంగా ప్రకటించారని. జాతీయ స్థాయి పత్రికలైన టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ టైమ్స్‌తో సహా పలు మీడియా సంస్థలు ఈ పుకారునే నిజమనుకుని వార్తగా ఇచ్చాయి. ఇది కూడా నిజం కాదని తర్వాత తేలింది. అసలు చెన్నై వరద బాధితులకు విరాళాలు పెద్ద మొత్తంలో రాకపోవటానికి రజనీయే కారణమంటూ మరో వాదన వినిపిస్తోంది. రజనీయే రు.10 లక్షలు ఇచ్చిన తర్వాత తాము ఆయన కంటే ఎక్కువ ఇస్తే బాగోదనే ఉద్దేశ్యంతో మిగిలిన యువ స్టార్స్ చాలామంది అంతకుమించి ఇవ్వలేదట.
ఇక టాలీవుడ్లో వరద బాధితులకు విరాళాల విషయంలో వర్మ ఒక పుకారు లేవదీశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రు.2 కోట్ల విరాళం ఇచ్చారని, దీనికిగానూ ఆయనను తాను అభినందిస్తున్నానని ట్వీట్ చేశారు. పవన్ చెన్నై బాధితులకు సాయం ఏమీ ప్రకటించకపోవటాన్ని వర్మ ఎద్దేవా చేసినట్లు తెలుస్తోంది. కానీ చాలామంది ఇది నిజమేననుకున్నారు. ఇలా ఉంది సూపర్ స్టార్ల విరాళాల ప్రహసనం.