వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వారికి విచిత్రమైన సమస్యలు వస్తున్నాయి. వారి పేర్లతో వేరే ఎవరో దందాలు చేస్తున్నారు. విషయం తెలిసే సరికి కొంత మంది మోసపోతున్నారు. చివరికి వారు తమకేం సంబంధం లేదంటూ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇలాంటి వాటిలో తాజా బాధితుడు.. కల్లం అజేయరెడ్డి అలియాస్ అజయ్ కల్లాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా ఉన్న ఆయన పేరు చెప్పి కొంత మంది ఉద్యోగాలు.. కాంట్రాక్టులు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా డబ్బులు ఇచ్చిన కొంత మంది గురించి అజేయకల్లాంకు తెలియడంతో మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. ఆయన తన పేరుతో మోసం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
కొద్ది రోజుల కిందట.. ఇదే సమస్య.. మరో కీలక అధికారిగా ఉన్న పీవీ రమేష్‌కు కూడా ఇలాంటి చిక్కులు వచ్చాయి. అయితే ఆయన పేరును వాడుకున్నది ఎవరో చిల్లర దొంగలు కాదు. నేరుగా నూతన్ నాయుడే వాడేసుకున్నారు. ఆయన పేరు వాడుకుని.. శిరోముండనం కేసు నుంచి బయటపడాలనుకున్నారు. విషయం తెలియడంతో ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇతర కేసులతో పాటు … పీవీ రమేష్ పేరును వాడుకున్న కేసు కూడా.. నూతన్ నాయుడు పై నమోదయింది. వీరిద్దరు అధికారులే… నేరుగా స్పీకర్ పేరును ఉపయోగిస్తూ.. మరికొంత మంది దందాలు చేశారు. ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపింది.
స్పీకర్ పేరుతో నేరుగా సెక్రటేరియట్‌లోనే ఓ వ్యక్తి దందాలు చేస్తున్నారని.. అతనితో స్పీకర్‌కు సంబంధం లేదని… స్పీకర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇలా వరుసగా… ప్రభుత్వంలో కీలకంగా ఉండే వారి పేర్లను ఉపయోగించుకుని ఉద్యోగాలు.. కాంట్రాక్టుల పేరుతో… ఇతరుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నేరాలు పెరిగిపోవడం.. వైసీపీ వర్గాల్లో సైతం చర్చనీయాంశం అవుతోంది. ఇలాంటి కేసులు ఇంకెన్ని బయటకు వస్తాయోనన్న చర్చ జరుగుతోంది.