రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ కథానాయిక. ఇదో స్పోర్ట్స్ డ్రామా. ఈ చిత్రానికి రెహమాన్‌ని సంగీత దర్శకుడిగా ఎంచుకొన్నారు. అయితే… తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది. ఈసినిమా నుంచి రెహమాన్ తప్పుకొన్నారని, ఆ స్థానంలో దేవిశ్రీ ప్రసాద్ వచ్చి చేరాడన్నది వార్తల సారాంశం. `ఉప్పెన`కు దేవినే సంగీత దర్శకుడు. ఆ సినిమా మ్యూజికల్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే భరోసాతో, రెహమాన్‌ని తప్పించి, దేవిశ్రీని లైన్లో పెట్టారని అనుకొన్నారు. అయితే ఇది అచ్చంగా ఫేక్ వార్త. ఈ సినిమా నుంచి రెహమాన్ తప్పుకోలేదు. దేవిశ్రీ ప్రసాద్ రాలేదు. రెహమాన్ స్థానం అలానే వుంది.
సినిమా పట్టాలెక్కకముందే… రెహమాన్ 3 పాటలకు ట్యూన్లు ఇచ్చేశారు. మరో రెండు పాటలు మాత్రమే బాకీ. ఓ రకంగా చెప్పాలంటే రెహమాన్‌కు సంబంధించి సగం పని పూర్తయిపోయినట్టే. పైగా ఈ సినిమాకు రెహమాన్ కావాలని బుచ్చిబాబు ఏరి కోరి ఎంచుకొన్నాడు. రెహమాన్‌తో నెలల పాటు ట్రావెల్ చేశాడు. అలాంటిది సడన్‌గా.. రెహమాన్‌ని పక్కన పెట్టాలనుకోవడం తొందరపాటే అవుతుంది. మరి ఈ ఫేక్ వార్త ఎలా పుట్టిందో? బహుశా… ‘ఉప్పెన’కు అంతటి సూపర్ హిట్ గీతాలిచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో లేకపోవడం అభిమానులకు నచ్చలేదనుకొంటా. వాళ్లే… ఈ వార్త పుట్టించి ఉంటారు. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలనలో వుంది. నిజానికి ఎన్టీఆర్ చేయాల్సిన కథ ఇది. ఆయనకు బాగా నచ్చిన స్క్రిప్ట్. కాకపోతే అనివార్య కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. ఇది చరణ్ చేతికి వచ్చింది. చరణ్ శైలికి బట్టి కథలో కీలకమైన మార్పులు చేశాడు బుచ్చిబాబు. ఇటీవల సుకుమార్ కూడా పూర్తి కథ విన్నారని, ఆయన గ్రీన్ సిగ్నల్ లభించిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.