`భారత మాజీ ప్రధాని వాజ్ పేయి ఇకలేరం’టూ ఓ తప్పుడు వార్తను నమ్మేసిన ఒడిషాలోని ఓప్రాధమిక పాఠశాల హెడ్ మాస్టర్ తన స్కూల్ లో సంతాపసభను కూడా పెట్టించాడు. ఇలా చేసినందుకు సదరు హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేయాల్సివచ్చింది. చివరకు తానూ క్షమాపణలు చెప్పుకోవాల్సివచ్చింది. ఎందుకిలా జరిగిందంటే…
అది ఒడిసాలోని బాలాసోర్ జిల్లా. అక్కడో ఊరు. ఆ ఊర్లోని ప్రాధమిక పాఠశాల హెడ్ మాస్టర్ కమలాకంఠదాస్ మరో చోట టీచర్స్ ట్రైనింగ్ కార్యక్రమానికి అటెండ్ అవడంకోసం వెళ్ళాడు. అక్కడో ఉపాధ్యాయుడి నోటినుంచి తప్పుడు వార్త విన్నాడు. అది నిజమేననని అనుకున్న ఈ హెడ్ మాస్టర్ వెంటనే తన స్కూల్ లోని ఒక టీచర్ కు ఫోన్ చేసి, `అయ్యో, ఇలా జరిగిపోయింది. వెంటనే సంతాపసభ పెట్టేయండి, ఆ తర్వాత స్కూల్ కు సెలవు ప్రకటించండి ‘ అని చెప్పేశారు. అంతే, హెడ్ మాస్టర్ నుంచి వచ్చిన ఆదేశాలను ఆ స్కూల్ టీచర్లు పాటించారు. సంతాపసభ పెట్టేసి, ఆ తర్వాత స్కూల్ కు సెలవు ప్రకటించారు.
అసలు విషయం తెలుసుకున్న తర్వాత హెడ్ మాస్టర్ తాను చేసిన తప్పును తెలుసుకుని క్షమాపణలు చెప్పేశాడు.
స్కూల్లో ఇలా సంతాపసభ పెట్టారని తెలియగానే స్థానికులు దిగ్భ్రాంతి చెందారు. బాధాతప్తహృదయంతో ఆరాతీస్తే చివరకు అది తప్పుడు సమాచారమని తేలింది. దీంతో ఆందోళనకు దిగారు. జిల్లాకలెక్టర్ కు ఫిర్యాదుచేశారు. అంతే, సదరు హెడ్ మాస్టర్ పై కఠిన చర్యతీసుకోవాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాల మేరకు హెడ్ మాస్టర్ని సోమవారం (14-09-15) సస్పెండ్ చేసినట్టు సర్వశిక్ష అభియాన్ బాలసోర్ జిల్లా ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ సురేందర్ ప్రసాద్ సంఖూ తెలియజేశారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. నివేదిక అందినతర్వాత అసలు సంగతి బయటపడుతుందని స్థానికులు భావిస్తున్నారు.
ఇది ఇలాఉంటే, మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం విషయంలో కూడా ఇలాగే జరిగింది. జార్ఖండ్ లో జూన్ నెలలో అక్కడి రాష్ట్ర విద్యాశాఖమంత్రి నీరా యాదవ్ వాస్తవం తెలుసుకోకుండా కలాంగారు జీవించిఉండగానే ఆయన చిత్రపటానికి దండేసి శ్రద్ధాంజలి ఘటించడం మరో విడ్డూరం.
మరి మీడియా సంగతేమిటి ?
పైన పేర్కొన్న సంఘటనలో సదరు హెడ్ మాస్టర్ తప్పుడు సమాచారాన్ని పూర్తిగా నమ్మేసి మాజీప్రధాని మృతికి వెంటనే సంతాప సభపెట్టేయాలనీ, స్కూల్ కి సెలవు ప్రకటించాలని ఆదేశించారు. గౌరవ వ్యక్తులకు సంబంధించిన వార్తలు వచ్చినప్పుడు వాటిలోని నిజానిజాలు ఆరాతీసిన తర్వాతనే స్పందించాలి. ఇందులో ఎలాంటి తొందరపాటు ఉండకూడదు. ఆ తర్వాత పశ్చాత్తాపపడినా ప్రయోజనం ఉండదు.
ఎప్పటి వార్తలను అప్పటికప్పుడే క్షణాలమీద అందించాలన్న తొందరలో ఎలక్ట్రానికి మీడియాలోకూడా ఇలాంటి తప్పుడు వార్తలు చాలానే వస్తున్నాయి. మరి అలాంటి వార్తలను ప్రజల్లోకి వదిలిపెడుతున్న వారిపై వెంటనే కఠినచర్యలు ఎందుకు తీసుకోవడంలేదన్నది ప్రశ్న. కనీసం క్షమాపణలు కూడా చెప్పని సంఘటనలు అనేకం. ఈమధ్య సోషల్ మీడియా కూడా ఇలాంటి పాత్రనే పోషిస్తోంది. అబ్దుల్ కలాం గారి విషయంలోనే సోషల్ మీడియా , సెల్ ఫోన్ ఎస్సెమ్మెస్ ల్లో ఈ తరహా సందేశాలే వచ్చాయి. చాలాకాలం క్రిందట జయప్రకాష్ నారాయణ్ (జేపీ) మరణించినట్టు ముందుగానే వార్తలు మీడియాలో వచ్చేశాయి. ఫలనా వ్యక్తి ఆరోగ్యం విషమంగా ఉందని ఉప్పు అందితేచాలు, ఆయనిక లేరన్న వార్తను ఇచ్చే విషయంలో మీడియా సంస్థలు పోటీపడటం సిగ్గుచేటు.
విషాదంపై జోక్ లు
సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తి మరణించకముందే తొందరపడి పత్రికలు, లేదా ఎలక్ట్రానికి మీడియా ఫలానా ఆయన ఇకలేరంటూ వార్తలొచ్చినా సదరు వ్యక్తి కోపంతెచ్చుకోకుండా – `అయ్యా, నేను ఇంకా చావలేదు, ప్రస్తుతానికి బతికేఉన్నాను, దయచేసి గమనించగలరు’ అంటూ మీడియా సంస్థలకు తెలియజెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి.
న్యూస్ పేపర్లలో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురితమైనప్పుడు సంపాదకవర్గం క్షమాపణలు చెప్పడం రివాజు. అయితే, నేరుగా క్షమాపణలు చెప్పేందుకు ఇగో అడ్డువచ్చి, మర్నాటి పేపర్ లో – `ఫలానా వ్యక్తి ఇంకా బ్రతికేఉన్నందుకు సంతోషిస్తున్నాం’ అంటూ వేస్తారంటూ జోకులుజోకులుగా చెప్పుకునేవారు. అదే వ్యక్తి మర్నాడు నిజంగా మరణిస్తే, అప్పుడు తమ తప్పును ఇలా కవర్ చేసుకుంటారట…
మరోసారి మరణించిన మాజీ మంత్రి
నిన్న మరణించిన సదరు మాజీ మంత్రిగారు నేడు పూర్తిగా మరోసారి మరణించారు. ఇవ్వాళ కచ్చితంగా మరణించిన మాజీ మంత్రిగారికి రేపు ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని విశ్వసనీయంగా తెలిసింది.
మరోసారి మరణించారంటూ కవరింగ్ ఇచ్చుకుంటారేగానీ, తమ తప్పును మాత్రం మీడియా ఒప్పుకోదన్న చురక ఈ వ్యంగ్య వార్తలో ఉంది. ఏదిఏమైనప్పటికీ, ఇలాంటి వార్తలను పాస్ ఆన్ చేసేటప్పుడు కచ్చితత్వం పాటించాలి. లేకపోతే ఇదిగో ఇలాంటి ఇబ్బందులే వస్తాయి.
(ఈ కథనానికి ఉపయోగించిన ఫోటో వాస్తవమైనది కాదని గమనించగలరు- రచయిత)
– కణ్వస