ఫేకింగ్ న్యూస్ ఛానెల్ టివీ999లో న్యూస్ రీడర్ నాగ్ ఏదో ముఖ్యమైన వార్త గురించి హడావుడిపడుతూ చెబుతున్నాడు. ఎవరో కరడుగట్టిన ఉగ్రవాదట…ఈ తెల్లవారుఝామున హైదరాబాద్ శివారు ప్రాంతంలో కాలిబూడదైపోయాడట. ఉగ్రవాది మరణానికి ఒక మహిళ కారణమైనదని చెబుతున్నాడు. ఆమెతో ఇంటర్వ్యూ మరికాసేపట్లో ఉంటుందని మధ్యమధ్యలో ప్రకటన చేస్తున్నాడు. ఆ వార్తాకథనం ఆసక్తిగా ఉండటంతో కళ్లూచెవులు టివీకి అంకితం చేశాను.
న్యూస్ రీడర్ నాగ్: హైదరాబాద్ లోని శివారు ప్రాంతమైన మణికొండ -సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అక్కడ పెద్దస్థాయిలో జరగలేదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కొద్దిసేపటి క్రితమే చెప్పారు. అయితే ఈరోజు ఉదయం అక్కడంతా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. కరడుగట్టిన ఉగ్రవాది ఈ తెల్లవారుఝామున అనూహ్యమైన రీతిలో మంటల్లో చిక్కుకుని బూడిదైపోయాడు. సజీవదహనమైన పూర్తిగా బూడిదకుప్పగామారిన వ్యక్తి మరెవరో కాదనీ, అతను ఉగ్రవాదిని ఎన్కే అని పోలీసులు చెబుతున్నారు. ఈ ఉగ్రవాదికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని నిఘావర్గాలు గతంలో హెచ్చరించాయి. ఎన్కే పేరుమోసిన ఉగ్రవాది. మనదేశంలోనేకాకుండా, ఇరుగుపొరుగు దేశాల్లో ఈ ఉగ్రవాదికి నేర చరిత్రఉంది. టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారిని ఉగ్రవాద ముఠాల్లో చేర్పించడంలో ఎన్కే దిట్టని చెబుతున్నారు.
అమ్మాయిలను కిడ్నాప్ చేయడంతోపాటుగా పలుచోట్ల బాంబుదాడులు, మహానగరాల విధ్వంసం, హత్యలు, మానభంగాలు వంటి నేరాలతో సంబంధం ఉన్నట్లు ఎన్కేపై అభియోగాలున్నాయి. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీచేసింది. ఎన్కే అనే ఈ ముష్కరుడిని పట్టుకోవడం కోసం మనదేశం నాలుగు నెలల క్రిందటనే శ్రీకృష్ణన్ నేతృత్వంలో ప్రత్యేక దళాన్ని ఏర్పాటుచేసింది. ఈ పరిస్థితుల్లో అనుకోకుండా ఎన్కే హైదరాబాద్ శివారు ప్రాంతమైన మణికొండ వద్ద ఈ తెల్లవారుఝామున కాలిబూడిదైపోయినట్లు వార్తలందాయి. ఎన్కే మరణించినట్లు తెలియగానే దేశమంతటా హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నలుమూలల నుంచి జనం మణికొండకు చేరుకుంటున్నారు. ఆసక్తిగా వివరాలు అడిగితెలుసుకుంటున్నారు. జనరద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగే అవకాశాలున్నాయని మా రిపోర్టర్ ప్రేమ్ అనుమానిస్తూ, అక్కడే ఓర్పుగా ఎదురుచూస్తున్నాడు.
ఉగ్రవాది మరణానికి ఒక మహిళ కారణమనీ, ఆమె కళ్లెదుటనే ముష్కరుడు మంటల్లో చిక్కుకుని చచ్చిపోయాడని అంటున్నారు. ఆ మహిళ ఇప్పుడు మన స్టూడియోకి వచ్చారు. ఆమె నుంచి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేద్దాం.
న్యూస్ రీడర్ నాగ్ : నమస్కారమండీ, సత్యభామగారు. అసలు ఇవ్వాళ ఉదయం మీరుండే మణికొండలో ఏం జరిగింది?
సత్యభామ : మరేనండీ, నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండీ. తెల్లవారుఝామునే లేచి ఇంటిముందు ముగ్గేస్తున్నానండి. అంతలో ఒక భారీ కాయుడు, నల్లగా ఉన్నాడు. పైగా ముఖానికి నల్లటి ముసుగొకటి. వాడు మా ఇంటిముందునుంచే వెళ్ళాడు. నేను ఎంతో కష్టపడివేసిన ముగ్గును తొక్కుకుంటూ వెళ్లాడు. కోపం నషాళానికంటింది… వాడి దిమ్మడిపోను…అంటూ తిట్టేశానండి. ఏమండీ, మీకో విషయం చెప్పాలి… అసలు ముగ్గు అంటే ఏమిటి…అదో ఆర్ట్. అందరికీ అబ్బే విద్యకాదుకదండి. సంక్రాంతి వస్తుందాయె, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నానండీ. పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలి. అప్పుడు ఓసారి మీ టీవీ వాళ్లొచ్చి కవర్ చేయాలి సుమండీ….
నాగ్ : (మధ్యలో అడ్డుతగులుతూ) చూడండి సత్య గారూ, ముగ్గుల గురించి మనం మరోసారి మాట్లాడుకుందాం. ఉగ్రవాది గురించి చెప్పండి.
సత్య : అదే చెబుతున్నానండీ. మీరు అడ్డుతగులుతున్నారు. మరే.., నేను అలా ముగ్గువేస్తుంటే వాడొచ్చి తొక్కితే నేను ఊరుకుంటానా. వెంటనే వాడి వీపుమీద ఒక్కటి చరిచాను. హడలెత్తి వాడు పరిగెత్తాడు. ఈలోగా నేను అరుపులు కేకలు పెట్టాను. ఇంట్లోని వాళ్లు, చుట్టుపక్కల అమ్మలక్కలు, మగాళ్లు లేచి బయటకువచ్చారు. ఈలోగా నేను వాడి వెంటపడ్డాను. వాడు పరిగెత్తుకుంటూ కాలవ దగ్గరకు వచ్చేసరికి తప్పించుకునే వీలులేకపోయింది. సరిగే అదే సమయంలో మా అబ్బాయి వెలిగించి ఇచ్చిన కాకరపువ్వొత్తిని వాడిమీదకు సూటిగా విసిరేశాను. అంతే, వాడి బట్టలకు నిప్పు అంటుకుంది. చూస్తుండగానే మంటలుపైకి లేచాయి. అంతా చూస్తుండగానే వాడు తగలబడిపోయాడు. మా అబ్బాయేమో `భలేభలే..’ అంటూ తప్పట్లుకొట్టి తెగ ఆనందపడిపోయాడు.
నాగ్ : మరి వాడు ఉగ్రవాదేనా…?!
సత్య : వాడు నల్లగా ఉన్నాడండీ… టివీల్లో చెబుతున్నట్లు వాడు ముష్కరుడిలాగా ఉన్నాడని మావాళ్లూ అన్నారు. పైగా వాడు కాలవ వొడ్డున చివర్లో నిలబడి మావైపు చూసి అదోలా నవ్వాడు. చంపేస్తా, కాల్చేస్తా అన్నట్లు చేతులు ఊపాడు. దీంతో మా మగాళ్లంతా వాడ్ని ఉగ్రవాదేనని అన్నారండీ.
నాగ్ : మీవాళ్లు అనుకోవడం సరే, మరి పోలీసులు కూడా అతను ఉగ్రవాదనీ, అతని పేరు ఎన్కే అంటున్నారు…
సత్య : అదంతా నాకు తెలియదండి. కాకపోతే వాడు చనిపోతూ చివర్లో బిగ్గరగా `యామె..యామె…’ అంటూ చాలా బాధగా అరిచాడండి. ఆ మాటలు నా చెవిలో `అమ్మా..అమ్మా..’ అన్నట్లు వినబడ్డాయండి. వెంటనే నా పక్కనే ఉన్న మా అబ్బాయి అమ్మా, నరకాసుర వధ జరిగిపోయిందంటూ చప్పట్లు కొట్టాడండి.
నాగ్ : ఇవ్వాళ ఉదయం ఉగ్రవాది మరణించినట్లు తెలుస్తున్నా, సత్య గారు మాత్రం ఇతిమిద్దంగా ఏదీ చెప్పలేకపోతున్నారు.. కొంతమంది ద్వాపరయుగంనాటి నరకాసురుడే వచ్చాడని, వాడిని వధించామని చెబుతున్నారు. కాగా, ఈ నారకాసురుడు పోలీసులు చెబ్తున్న ఎన్కే ఒకరాకాదా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈలోగా ఉగ్రవాది మరణం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మణికొండ శాంతిపరిరక్షక దళం రేపు విజయోత్సవం జరుపుకోవాలనీ, ప్రతి ఇంట్లో దీపాలను ఎక్కువ సంఖ్యలో వెలిగించాలనీ, అలాగే సత్యకు వీరనారి బిరుదుతో సన్మానం నిర్ణయించినట్లు తెలిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు, ఇప్పుడో స్మాల్ బ్రేక్. చూస్తూనే ఉండండి టివీ త్రిబుల్ నైన్.
టివీ చూస్తున్న నాకు చిర్రెత్తుకొచ్చి కట్టేశాను. ఇంతలో మా అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి – నాన్నా నేనూ, నా ఫ్రెండ్స్ కలసి నరకాసురుడ్ని వధించేశాం. కాకరపువ్వొత్తితో కాదు, కంటి చూపుతో చంపేశాం – అంటూ పగలబడి నవ్వేశాడు.
– కణ్వస