ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంకు.. నకిలీ పీఏ చికాకులు తెప్పిస్తున్నారు. సోమేశ్వరరావు అనే వ్యక్తి తాను స్పీకర్ తమ్మినేని సీతారాం పీఏనని నకిలీ ఐడీ కార్డ్ తయారు చేసుని నేరుగా ప్రభుత్వ కార్యాలయాల్లో దందా చేసేస్తున్నారు. బదిలీలు చేయిస్తానని.. ఉద్యోగాలిప్పిస్తానని పలువురి దగ్గర డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ఈ విషయం స్పీకర్ కార్యాలయం దృష్టికి వెళ్లింది. దీంతో సోమేశ్వరరావు అనే వ్యక్తితో స్పీకర్‌కు గానీ, అసెంబ్లీకి గానీ, ఎలాంటి సంబంధం లేదని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. ఇక్కడే అసలు అనుమానం టీడీపీ నేతలకు వచ్చింది.
ముఖ్యంగా కూన రవికుమార్‌కు వచ్చింది. అదేమిటంటే నకిలీ ఐడీ కార్డు చేయించుకుని నేరుగా స్పీకర్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూంటే..కనీసం ఫిర్యాదు కూడా చేయకుండా.. ఆ సోమేశ్వరరావు పట్టుకోకుండా.. ఎలాంటి సంబంధం లేదని ప్రకటన చేయడంలో లాజిక్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సోమేశ్వరరావు నేరం చేశారని ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. స్పీకర్ తమ్మినేనికి.. సోమేశ్వరరావుకు సంబంధం లేదని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. సోమేశ్వరరావు ఎవరో తెలియకపోతే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
అసెంబ్లీ సెక్రటేరియట్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సోమేశ్వరరావు ద్వారా స్పీకర్ డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న ఆడియోలను కూన రవికుమార్ బయట పెట్టారు. మొత్తానికి ఈ సోమేశ్వరరావు ఎవరో.. ఆయన ఎంత మంది వద్ద డబ్బులు వసూలు చేశారో… ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారో.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో… లెక్క బయటకు వస్తే కానీ.. ఈ వివాదం సద్దుమణిగే పరిస్థితి లేదు.