ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఇప్పుడు ఓ పెద్ద సమస్య ఎదురొచ్చింది. అదేమిటంటే… నేరుగా డీజీపీ మీదనే నకిలీ ట్విట్టర్ అకౌంట్ తెరిచారు. దానికి పెద్ద ఎత్తున ఇతర పోలీసు అధికారుల్ని కూడా.. ఫాలోయర్లుగా చేర్చుకున్నారు. ఆనక.. వివాదాస్పదమైన రాజకీయ ట్వీట్లు పెట్టడం ప్రారంభించారు. ఇదేదో పెద్ద రగడ అవుతుందనుకుంటున్నసమయంలో హఠాత్తుగా అది నకిలీ ఖాతా అని తొలగించేశారు. ఇప్పుడు దాన్ని ఎవరు క్రియేట్ చేశారు..? ఎవరు ట్వీట్లు చేశారు..? అన్నదానిపై విచారణ ప్రారంభించినట్లుగా పోలీసు అధికారులు చెబుతున్నారు. చిత్తూరుకు ప్రత్యేక బృందం వెళ్లిందని కూడా చెబుతున్నారు.
నిజానికి ఓ ట్విట్టర్ అకౌంట్ నకిలీదో కాదో తెలుసుకోవడం క్షణాల్లో పని . ప్రస్తుతం సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు తెరిచి డబ్బులు అడుగుతున్న నేరాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమపై ఎలాంటి కొత్త అకౌంట్ క్రియేట్ అయిపోయినా.. వేరే వారికి తెలిసిపోతుదంి. అలాంటిది..సాక్షాత్తూ ఏపీ డీజీపీ అంటూ.. కొత్త ట్విట్టర్ అకౌంటర్ తెరవడం… అనేక మంది పోలీసు అధికారులు ఫాలోయర్లుగా చేర్చుకోవడం … వివాదాస్పద ట్వీట్లు చేసే వరకూ గుర్తించలేకపోవడం.. ఈ కేసులో ట్విస్ట్‌గా మారింది.అంతే కాదు.. ఈ విషయం బయట పడి మూడు రోజులు అవుతున్నా… ఎవరు ఈ పని చేశారో గుర్తించలేకపోయారు.
చిత్తూరు జిల్లాలో అకౌంట్ క్రియేట్ అయిందని చెబుతూ.. అక్కడికి ప్రత్యేక బృందం వెళ్లిందని చెబుతున్నారు. నిజానికి పోలీసులు ఇలాంటివి మీడియాకు సమాచారం ఇవ్వక ముందే… ఆ ట్వీటర్ అకౌంట్‌ను క్రియేట్ చేసిన వారిని పట్టుకుని … ముసుగేసో.. ముసుగేయకుండానో మీడియా ముందు ప్రవేశపెట్టేవారు. చిత్తూరు జిల్లాకు ప్రత్యేకంగా టీముల్ని పంపాల్సిన పని లేదు.చిత్తూరు జిల్లాలోనూ పెద్ద ఎత్తున పోలీసు బలగం ఉంది. అందుకే… నకిలీ ట్విట్టర్ అకౌంట్ విషయంలో పోలీసులు… ఏదో దాస్తున్నారన్న అభిప్రాయం కలిగేలా చేస్తోంది.
సోషల్ మీడియాలో ఎవరైనా వ్యతిరేక పోస్టులు పెడితే… వారి అనుపానులు కనుక్కుని అర్థరాత్రి .. అపరాత్రుళ్లు కూడా చూడకుండా ఎత్తుకొచ్చే పోలీసులకు… తమ బాస్ పేరు మీదే నకిలీ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి… ఆయన నీతి నిజాయితీలకు… భంగం కలిగేలా.. వివాదాస్పద ట్వీట్లు చేస్తే.. మాత్రం.. పట్టుకోవడానికే రెండు మూడు రోజులు సరిపోలేదు. ఈ కేసును కూడా చివరికి నాన దీసి… గతంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కాంలో అసలు నిందితుల్ని లైట్ తీసుకున్నట్లుగా తీసుకునే చాన్స్ ఉందన్న అనుమానాలూ వస్తున్నాయి. మొత్తానికి ఏపీ పోలీసుల పని తీరు.. ఎప్పుడూ.. సస్పెన్స్ ధ్రిల్లర్గానే ఉంటోంది.