కారులో ఉన్న చాక్లెట్లు.. మరణశాసనం రాస్తాయని ఎవరైనా ఊహిస్తారా..? పాపం చిన్న పిల్లలు అని కారులో ఉన్న చాక్లెట్లను.. ఇవ్వడం కొట్టి చంపడానికి దారి తీస్తుందని ఎవరైనా అనుకుంటారా..?. సినిమాల్లో వచ్చి పడినట్లు..మనుషుల గుంపు తమ మీద దాడి చేయడానికి ఆ చాక్లెట్లే కారణమవుతాయని అంచనా వేసుకుంటారా..?. ఈ అనుమానాలు లేశమాత్రం కలిగినా.. కారులోని వారు చాక్లెట్లు బయటకు తీసేవారు కాదు. చావు అంచుల వరకూ వెళ్లేవారు కాదు.
కర్ణాటకలోని బీదర్ సమీపంలోని ముర్కీ అనే గ్రామంలో వంద మందిపైకి పైగా ఒక్కసారిగా.. ఓ కారుపై విరుచుకుపడ్డారు. అందులో ఉన్న వారిని బయటకు లాగి.. ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఒకరు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఎందుకు కొట్టారంటే… ఓ గ్రామంలో తాము టీ తాగడానికి దిగిన చోట.. కనిపించిన పిల్లలకు కాసిని మాటలు చెప్పి.. చాక్లెట్లు ఇచ్చినందుకు. పిల్లలను ఎత్తుకెళ్లేవారు తిరుగుతున్నారంటూ.. వాట్సాప్లో జరుగుతున్న ప్రచారం .. పిల్లలకు చాక్లెట్లు ఇవ్వడం కలిసి.. వాళ్లని బూచోళ్లగా లెక్క కట్టేసి… చంపడానికి కూడా సిద్ధపడ్డారు.
ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన మహ్మద్ ఆజాం మృతిచెందగా.. తహ్లా ఇస్మాయిల్, మహమ్మద్ సల్మాన్ గాయపడ్డారు. వీరు ముగ్గురూ.. బీదర్కే చెందిన తమ స్నేహితుడు పిలుపు మేరకు అతి స్వగ్రామానికి వెళ్లారు. మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులకు నిజనిజాలు చెప్పేందుకు ప్రయత్నించినా.. ఎవరూ వినిపించుకోలేదు. తప్పించుకునేందుకు వారు కారులో వెళ్లిపోయారు. కానీ ముర్కీ గ్రామంవద్ద రోడ్డుకు అడ్డంగా చెట్టును పడేసి.. వారిని అడ్డుకున్నారు. వారిని కారులో నుంచి బయటకు లాక్కొచ్చి.. రాళ్లతో, కర్రలతో దాడి చేశారు.
ఇటీవలి కాలంలో.. పిల్లలను ఎత్తుకెళ్లేవారి పేరుతో.. వరుసగా దాడులు జరుగుతున్నాయి. కొట్టి చంపేవరకూ ఎవరూ విడిచి పెట్టడం లేదు. బూచోళ్లు తిరుగుతున్నారంటూ.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే దీనికి కారణం. అలాంటివేమీ జరగడం లేదని చెప్పినా.. వినిపించుకునే పరిస్థితిలో ప్రస్తుతం… గ్రామీణులు లేరు.