అమెరికాలో తెలుగువారి అతి పెద్ద సంఘం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా .. తానా ఎన్నికలకు కూడా.. తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు చేసే వికృత రాజకీయ తెలివి తేటల తెగులు తగులుకుంది. కొందరు ఓటర్ల లిస్ట్ తయారీలో అవకతవకలకు పాల్పడినట్లుగా తేలింది. దీంతో తానా ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇప్పుడీ వ్యవహారం ప్రవాసాంధ్రుల్లో కలకలం రేపుతోంది. ఓటర్ల లిస్ట్ ఫ్రాడ్ విషయం పై తానా బోర్డు అత్యవసర సమావేశం రేపుఇరవై ఐదున జరగనుంది. ఆ సమావేశంలో ఏం చర్యలు తీసుకుంటారోనన్నది ఇప్పుడు ప్రవాసాంధ్రుల్లో చర్చనీయాంశమయింది.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానాకు సంబంధించి 2021-23 కాలానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ, 2021-25 కాలానికి బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. పోటీదారులందరూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. తానాలో ముఫ్పై ఏడువేల మంది సభ్యులున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సభ్యులందరికీ బ్యాలెట్లను ఏప్రిల్పదిహేనో తేదీ నాటికి పంపాల్సి ఉంది. కానీ నిలిపివేశారు. ఇరవై రెండో తేదీన అంటే రెండు రోజుల కిందట… తానా నామినేషన్ అండ్ ఎలక్షన్ కమిటీ.. సభ్యులందరికీ..ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ఈ మెయిల్ సమాచారం పంపారు.
ఎన్నికల ప్రక్రియ నిలిపివేయడం అసాధారణం లాంటిదే. అందుకే తెలుగు360 అసలు తానాలో ఏం జరుగుతుందో అనే దానిపై విశ్వసనీయ సమాచారాన్ని సేకరించింది. తెలుగు360కి అందిన సమాచారం ప్రకారం.. ఓటర్ జాబితాలోఅవకతవకలను తానా ఎన్నికల కమిటీ కనిపెట్టింది. సాక్ష్యాధారాలతో సహా ఉండటంతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేసింది.
ఈ అవకతవకలకు పాల్పడింది తానా ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రస్తుతం మెంబర్‌గా ఉన్న కీలక వ్యక్తే. మరోసారి ఎన్నికల్లో కీలక పదవి కోసం అతను పోటీపడుతున్నారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా మార్చి నెలలో ఓటర్ల జాబితాను అంతర్గతoగా క్షుణ్ణంగా పరిశీలించారు. నిజానికి ఈ ప్రక్రియ కూడా వివాదాస్పదం అయింది. ఆ పరిశీలన తర్వాత.. ఓటర్ జాబితాను ధర్డ్ పార్టీ కంపెనీకి పంపించారు. ప్రింటింగ్ కి .. బ్యాలెట్ పేపర్ల మెయిలింగ్ బాధ్యతను ఒక ధర్డ్ పార్టీ కంపెనీ చేపడుతుంది. నేషనల్ చేంజ్ ఆఫ్ అడ్రస్ వెరిఫికేషన్ సమయంలో … అక్రమాలకు నేతృత్వం వహించిన తానా ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ ఫేక్ ఓటర్లను చొప్పించారు. కానీ ఇందులో అనేక అనుమానాలు తలెత్తే తప్పులు చేశారు. పెళ్లి కాని వారికి భార్య, భర్తల పేర్లను జోడించారు. కొంత మంది ఓటర్ల బ్యాలెట్ల అడ్రస్‌ను మార్చేశారు. అప్డేటెడ్ ఓటర్ లిస్టును అందుకున్న తర్వాత బ్యాలెట్ల ప్రింటింగ్ –మెయిల్ చేయాల్సిన ధర్డ్ పార్టీ కంపెనీకి.. అనుమానం వచ్చింది. తానా అసలు అప్రూవ్డ్ లిస్ట్‌కి… అప్డేటెడ్ లిస్ట్‌కి ఓటర్ల సంఖ్యతేడా ఉండటంతో ఎన్నికల కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఫ్రాడ్ జరిగిందని తెలుసుకున్న ఎలక్షన్ కమిటీ.. ఆ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌ను ఈ అంశంపై ప్రశ్నించింది కూడా.
కొద్ది రోజుల పాటు అంతర్గత చర్చల తర్వాత అదనంగా చేర్చిన ఫేక్ ఓటర్లను తొలగించాలని నిర్ణయించారు. తదుపరి చర్యల కోసం.. తానా బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన ఆ సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం తానా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారందరూ.. ఈ ఓటర్ల లిస్ట్ ఫ్రాడ్‌ను సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మొత్తం స్కాంకు పాల్పడిన ఎగ్జిక్యూటివ్ మెంబర్‌కు తానాలోనే మంచిసపోర్ట్ ఉంది. బోర్డులో కొంత మంది ఆయనను కాపాడి.. ఎవరినైనా బలి పశువును చేసేదుకు ప్రయత్నిస్తున్నారన్నఆరోపణలు వినిపిస్తున్నారు.
తానా ఎన్నికల్లో పోటీ చేస్తున్న రెండు ప్యానళ్లు ప్రస్తుత పరిస్థితిపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. చేంజ్ ప్యానల్పేరుతో పోటీ చేస్తున్న గ్రూప్.. ఈ వివాదాన్ని చిన్నదిగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇంక్లూజివ్ ప్యానల్ పేరుతో పోటీ చేస్తున్నగ్రూప్.. ఈ మొత్తం వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల లిస్ట్ అవకతవకలకు పాల్పడటం.. అంటే ఫెడరల్ క్రైమ్ లాంటిదని.. ఇది… తానా అస్థిత్వాన్ని దెబ్బ తీస్తుందని వారు వాదిస్తున్నారు. ఇప్పుడు అవకవతవకలకు పాల్పడిన వారిపై అత్యవసర బోర్డు మీటింగ్‌లో ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న ఆసక్తి అందరిలో ఏర్పడింది.