మొదట తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో దొంగ ఓటర్లను వెల్లువలా వాడుకున్నారు. తర్వాత పోటీ లేని బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికల్లోనూ దొంగ ఓటర్ల హడావుడి కనిపించింది. పార్లమెంట్, అసెంబ్లీ నుంచి మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ దొంగ ఓటర్ల బస్సులు హల్ చల్ చేస్తున్నాయి. చంద్రబాబు నియోజకర్గం కుప్పం మున్సిపాలిటీని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని మంత్రి పెద్దిరెడ్డికి టార్గెట్‌గా పెట్టడంతో ఆయన తాను ఇంచార్జ్‌గా వ్యవహరించిన తిరుపతి ఉపఎన్నిక, బద్వేలు ఉపఎన్నిక వ్యూహాన్నే కుప్పంలోనూ అమలు చేయడానికి వ్యూహం పన్నారని రెండు రోజుల నుంచి కుప్పంలోకి వచ్చిన ఇతర ప్రాంతాల వాసులను చూస్తే అర్థమైపోతుందని టీడీపీ నేతలు అంటున్నారు.
నిన్ననే ఓస్కూల్లో ఉన్న దొంగ ఓటర్లను టీడీపీ నేతలు పట్టించారు. ఉదయం నుంచి అనేక పోలింగ్ బూత్‌ల వద్ద టీడీపీ నేతలు స్వయంగా స్థానికులు కాని వారిని గుర్తించడం ప్రారంభించారు. ఇలా పదుల సంఖ్యలో దొంగ ఓటర్లను పట్టుకున్నారు. కొంత మందిని పోలీసులు తీసుకెళ్లారు. చాలా మంది దగ్గర కనీస ఐడెంటీటీ కార్డులు కూడా లేవు. ఈ పరిస్థితి చూసి టీడీపీ నేతలు పలు చోట్ల దొంగ ఓటర్లపై దాడులు చేశారు. తమిళనాడు వైపు నుంచి దొంగ ఓటర్లతో వస్తున్న ఓ బస్సును ఆపి టీడీపీ నేతలు అద్దాలు పగుల గొట్టారు.
చాలా చోట్ల దొంగ ఓటర్లకు పోలీసులే సహకరిస్తున్నారన్న ఆరోపణలు టీడీపీ నేతలు చేశారు. అయితే తిరుపతి, బద్వేలు ఉపఎన్నికల్లో ఇలా దొంగ ఓట్ల పోలింగ్ జరుగుతున్నప్పుడే కేంద్ర ఎన్నికల సంఘమే పట్టించుకోలేదు.. ఇక మున్సిపల్ ఎన్నికలు కూడా అలాగే జరుగుతూంటే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం పట్టించుకుంటుందా ? టీడీపీ నేతల ఫిర్యాదులు అరణ్య రోదనలుగానే మిగిలిపోయాయి.