తిరుపతి ఉపఎన్నికల్లో దొంగ ఓట్ల కలకలం ప్రారంభమయింది. రెండు లక్షల దొంగ ఓట్లను నమోదు చేయించారని మొదట బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే నిజంగా దొంగ ఓట్లు ఉంటే.. వారు ఈసీకి ఫిర్యాదు చేసి.. వాటిని తీసేయించే ప్రయత్నం చేయాలి కానీ.. ప్రెస్మీట్లు ఎందుకు పెట్టారని చాలా మంది అనుకున్నారు. అందుకే పట్టించుకోలేదు. బీజేపీ నేతలు కూడా.. ఆరోపణలు చేస్తే చాలు.. ఫిర్యాదులు అక్కర్లేదనుకున్నారు. ఆ తర్వాత టీడీపీనేతలు కూడా అవే ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్లో నిజాలు నిగ్గు తేలలేదు కానీ.. పోలింగ్ డేట్ వచ్చేసింది. పోలింగ్ ప్రారంభమైన సందర్భంగా.. తిరుపతిలో ఎక్కడ చూసినా జన సందోహం కనిపిస్తోంది.
తిరుపతిలో యాత్రికులు సహజంగానే ఎక్కువగా కనిపిస్తూంటారు. ఇప్పుడు దర్శనాలను టీటీడీ నియంత్రించింది. కానీ ఎప్పుడూ లేనంతగా పోలింగ్ రోజు ఉదయం… తిరుపతి మొత్తం జన సమూహం అయ్యారు. పెద్ద ఎత్తున బస్సులు కార్లలో వచ్చి… వైసీపీ నేతలకు చెందిన కన్వెన్షన్ సెంటర్లలో మకాం వేశారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత వారంతా గుంపులు గుంపులుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. నెల్లూరు జిల్లాలోనూ అదే పరిస్థితి. ఎక్కడి వారికో తిరుపతిలో ఓటు ఎలా వచ్చిందని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఇతర ప్రాంతాల ఓటర్లు ఎలా జాబితాలోకి వచ్చారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డికి చెందిన కన్వెన్షన్ సెంటర్ జాతరను తలపిస్తోంది. బస్సులు… కార్లలో అక్కడికి కొన్ని వేల మంది వచ్చారు. వారందరూ ఓట్లు వేయడానికి వచ్చిన వారే. వారిని చూసి ఇతర పార్టీల నేతలు ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ఇంత పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను వచ్చినా అడ్డుకోలని నిస్సహాయ స్థితిలో ఇతర పార్టీలు పడ్డాయి. బీజేపీ నేతలు ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీ నేతల్ని పోలీసులు ముందుకు అడుగు వేయనీయడం లేదు. ఈవీఎంల కారణంగా నేరుగా రిగ్గింగ్ చేసుకోవడం సాధ్యం కాదు. అందుకే దొంగ ఓట్ల ప్లాన్ వేశారన్న ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్నారు.