ఒకవైపు అంతర్జాతీయస్థాయి రాజధాని నిర్మిస్తున్నామని అనుదినం ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. అది కూడా నిర్మాణంలో కొత్త రికార్డులు అని అంటున్నారు. వంద రోజుల్లో సచివాలయ నిర్మాణం అయిపోయిందని అన్నారు. మరి అలా నిర్మించినది తాత్కాలిక సచివాలయం అని అన్నారు కానీ, ఎంత తాత్కాలికం అయినా మరీ ఇంత త్వరగా రెయిలింగ్ కూలడం ఏమిటి? అనేది ఇప్పుడు తలెత్తుతున్న సందేహం! వెలగపూడి లో సచివాలయం ఇంకా నిర్మాణం పూర్తి కాకుండానే రెయిలింగ్ కూలిపోవడంతో ఈ పనుల్లో నాణ్యత పై విమర్శలు మొదలయ్యాయి.
మామూలు ఖర్చు కాదు, స్థలం ప్రభుత్వానిదే అయినా.. కనీవినీ ఎరగని స్థాయిలో ఖర్చు పెట్టి తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ నడిబొడ్డున భూమి కొనుగోలు చేసి, ఈ స్థాయి భారీ నిర్మాణాన్ని చేపట్టడానికి అయ్యే ఖర్చుకు నాలుగైదు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తూ సచివాలయ నిర్మాణం చేపట్టారు. ఇక్కడ భూమి కూడా ప్రభుత్వానిదే. అయినా కూడా వందల కోట్లు మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టారు. మరి అలాంటి నిర్మాణం కూడా పూర్తికాకుండానే రెయిలింగ్ కూలిపోవడంతో జరుగుతున్న పనుల్లో నాణ్యత ఏమిటో స్పష్టం అవుతోంది.
అయితే మెజారిటీ మీడియా వర్గం చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటంతో ఇలాంటి అంశాలపై చర్చ జరగడం లేదు. తాత్కాలిక సచివాలయానికి భారీ పెడుతున్న ఖర్చు విషయంలోనూ మీడియాలో చర్చ లేదు. ఇక రెయిలింగ్ కూలడంపై అసలు చాలా మీడియా వర్గాల్లో వార్తే లేదు. ఇది ప్రభుత్వానికి చాలా ప్లస్ పాయింటే. ఇదే సమయంలో ప్రభుత్వంపై కొన్ని వ్యంగ్యాస్త్రాలు కూడా పడుతున్నాయి. దేశీయ కంపెనీలతో పని చేయిస్తే.. ఇలా ఉంటుంది, రెయిలింగులు కూలిపోతాయ్ అనే బాబు అమరావతి నిర్మాణాన్ని విదేశీ సంస్థలకు అప్పగించాడని కొంతమంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.