అదిగో పులి కనిపించింది అని దూరంగా ఓ పిల్లి లాంటి జంతువును వీడియో తీసి పంపిస్తే… ముందూ వెనుకా ఆలోచించకుండా మియాపూర్‌లో పులి అంటూ మీడియా రచ్చ చేసేసింది. మియాపూర్ ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజల్ని బయటకు రాకుండా చేసేశారు. మీడియా అంటే జనాల్ని ఎంత భయపెడితే అంత వ్యూస్ అనుకునే పరిస్థితి వచ్చింది. నిజానికి వారు చూపించిన వీడియో చూస్తే చిన్నపిల్లవాడు కూడా అది పులి కాదని చెప్పేస్తాడు.
మీడియా హడావుడితో అధికారులు గట్టి పరిశోధన చేసి పులి కాదు పిల్లి అని తేల్చారు. హైదరాబాద్ మహానగరంలో పులి ఎక్కడి నుంచి వస్తుందో కనీసం ఆలోచించే ప్రయత్నం కూడా మీడియా చేయడం లేదు. రెండు దశాబ్దాల కిందట జూబ్లిహిల్స్‌లో ఓ పులి కనిపించింది. దాన్ని పట్టుకునేలోపు చనిపోయింది. నిజానికి అది ఓ డబ్బున్న వ్యక్తి తన ఫామ్ హౌస్‌లో పెంచుకుంటున్న పులి. ఎందుకు ఇంటికి తెచ్చుకున్నాడో అది ఎందురు దారి తప్పిందో కానీ… చివరికి చనిపోయింది. అయితే అలా పులిని పెంచుకోవడం చట్ట విరుద్ధం కాబట్టి ఎవరూ నోరు మెదపలేదు. ఎక్కడో అడవి నుంచి వచ్చింది కాబోలు అని సర్ది చెప్పుకున్నారు.
ఇప్పుడు మియాపూర్లోనే కాదు హైదరాబాద్‌లోని బడాబాబులు కూడా పులుల్ని పెంచుకునేంత సాహసం చేయడం లేదు. నర్సాపూర్ అడవుల నుంచి నగరంలోకి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఒక వేళ ఉన్నా నిర్దారించుకుని వార్తల్ని జాగ్రత్తగా ప్రచారం చేయాల్సింది. లేకపోతే కొన్ని వేల మందిని పానిక్‌కు గురి చేసి ఆనందం పొందినట్లవుతుంది. ఇప్పుడు అదే జరిగింది.