మోహన్ బాబు వారసులుగా విష్ణు, మనోజ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నిజానికి మనోజ్ తో పోల్చుకుంటే విష్ణు ఎంట్రీ చాలా గ్రాండ్ గా జరిగింది. బిగినింగ్ లో చాలా ఖర్చు చేసి మంచి కాంబినేషన్లతో విష్ణు సినిమాలు చేసేవారు. కానీ టాప్ లీగ్ లోకి రాలేకపోయారు. కొంతకాలం తర్వాత ఆయన చేసే సినిమాలు అన్నీ కూడా ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయినాయి. ఇప్పుడు కన్నప్ప తో చాలా భారీగా సినిమా చేసి మళ్లీ కం బ్యాక్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు విష్ణు.
మనోజ్ ప్రయాణం మాత్రం కాస్త భిన్నంగా సాగింది. విష్ణుతో పోల్చుకుంటే మనోజ్ సినిమాల్లో అంత భారీదనం ఉండేది కాదు. మంచి కాన్సెప్ట్ పట్టుకుని కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. అయితే విష్ణు కంటే మనోజ్ కి బెటర్ ఫాలోయింగ్ వుండేది. తన ఆటిట్యూడ్ మాస్ కి నచ్చేది. అయితే దీన్ని కొనసాగిస్తూ సినిమాలు చేయడంలో మనోజ్ ట్రాక్ పూర్తిగా తప్పేసింది. వ్యక్తిగత కారణాలవల్ల వైవాహిక జీవితంలో కొన్ని సమస్యల వల్ల ఆయన సినిమాలకి పూర్తిగా దూరం అయ్యాడు.
రెండో పెళ్లి తర్వాత ఆయన కెరీర్లో మళ్ళీ కదలికలు వచ్చాయి. కొన్ని క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడు. ఈటీవీలో ఒక షో చేశాడు. అలాగే మిరాయి సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నాడు. దీంతోపాటు ఇంకొన్ని కథలు కూడా లైన్ లో పెట్టాడు.
సరిగ్గా ఈ సమయంలోనే ఫ్యామిలీ గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవల్లోనే మనోజ్ తల మునకలై ఉన్నాడు. క్షణం తీరిక లేకుండా కోర్ట్ లు, పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతున్నాడు. మనోజ్ వ్యక్తిగత కారణాలవల్ల కొన్ని సినిమాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. అలాగే రాబోయే సినిమాల్లో మనోజ్ ని తీసుకోవాలా వద్దా అనే సందేహంలో పడిపోయారు నిర్మాతలు.
సెకండ్ ఇన్నింగ్స్ చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్న మనోజ్ కి ఈ ఫ్యామిలీ సమస్యలు ఇరకాటంలో పెట్టాయి. ఈ గొడవలు వీలైనంత త్వరగా క్లోజ్ చేయకపోతే ఆయన కెరీర్ డేంజర్ లో పడుతుంది. మనోజ్ లో కూడా ఈ భయం ఉంది. వీలైనంత త్వరగా ఈ సమస్యల్ని సెటిల్ చేసుకొని తన సెకండ్ ఇన్నింగ్ పై దృష్టి పెట్టాలనే ఆలోచనలతో ఉన్నాడు. ఒకవేళ ఈ సమస్యలు త్వరగా పరిష్కారం కాకపోతే మాత్రం మనోజ్ కెరీర్ ఇంకా ట్రబుల్స్ లోకి జారినట్లే.