‘గీత గోవిందం’తో తన మార్క్ చూపించాడు పరశురామ్. ఆ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. వంద కోట్ల సినిమా తీస్తే సహజంగానే పెద్ద హీరోల దృష్టి పడుతుంది. అలా.. మహేష్‌బాబుతో సినిమా ఓకే చేయించుకొన్నాడు పరశురామ్. వారిద్దరి కాంబోలో ‘సర్కారు వారి పాట’ మొదలైంది. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర మిక్డ్స్ ఫలితాన్ని అందుకొంది. వసూళ్లు ఓకే అనిపించుకొన్నా, దర్శకుడిగా పరశురామ్ మార్క్ కనిపించలేదు. దాంతో తదుపరి సినిమా ఆలస్యమైంది. మొత్తానికి `ఫ్యామిలీ స్టార్`ని పట్టాలెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా ఫలితంపై తన తదుపరి సినిమా ఆధారపడి వుంది.
‘ఫ్యామిలీ స్టార్’ సమయంలోనే తమిళ హీరో కార్తికి ఓ కథ చెప్పాడు పరశురామ్. అదే ‘రెంచ్ రాజు’. ఈ కథ కార్తికి నచ్చింది కూడా. అయితే తనకున్న కమిట్మెంట్స్ వల్ల హోల్డ్‌లో ఉంచాడు. ఒకవేళ ‘ఫ్యామిలీ స్టార్’ హిట్టయితే, కార్తి ఫోకస్ పరశురామ్ పై పడుతుంది. దాంతో.. ఆ ప్రాజెక్ట్ ఆన్ అవుతుంది. ఇప్పుడు పరశురామ్ దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దిల్ రాజు బ్యానర్లోనే మరో సినిమా చేయడానికి అగ్రిమెంట్ కుదిరిందని సమాచారం. అయితే.. అది కూడా ‘ఫ్యామిలీ స్టార్’ ఫలితంపైనే ఆధారపడి ఉంది. ఇంకొన్ని గంటల్లో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా థియేటర్లలోకి వచ్చేస్తుంది. పరశురామ్ సినిమా కార్తీతోనా, మరో హీరోతోనా అనేది పూర్తిగా ‘ఫ్యామిలీ స్టార్’ చేతుల్లోనే ఉంది.