వ్యక్తిపూజ రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లోనూ ఎక్కువగా కనిపిస్తుంటుంది. హీరోలకు అభిమానులు లేరిప్పుడు అంతా భక్తులే. అయితే ఇప్పుడు దర్శకులకూ ఇలాంటి భక్తజనం పోగవుతున్నారు. తాజాగా దర్శకుడుపూరి జగన్నాథ్కి ఓ విగ్రహం కట్టాడు వీరాభిమాని. కరీంనగర్ జిల్లా కొండాపూర్ గ్రామంలో ప్రభాకర్ అనే ఓ అభిమాని పూరీ జగన్నాథ్ విగ్రహాన్నిఏర్పాటు చేశాడు. దాన్ని పూరి తనయుడు ఆకాష్ పూరీ ఆవిష్కరించాడు.
విగ్రహాలు ఎవరికి పెడతాం?? ఎవరిని పూజిస్తాం?? సినిమా వాళ్లేమైనా దేశ సేవ చేస్తున్నారా? కనీసం వాళ్లు పుట్టిన ఊరినైనా పట్టించుకొంటున్నారా? కనీపెంచిన అమ్మానాన్నల్ని నిర్లక్ష్యం చేస్తున్న అభిమానులు కూడా… తాను అభిమానించే హీరోనో, హీరోయిన్నో, దర్శకుడినో ఇలా దేవుళ్లని చేసేయడం ఎంత వరకూ న్యాయం?? దానికి సెలబ్రెటీలు కూడా వంత పాడడం విడ్డూరంగా ఉంది. చలం భావాలు, రంగనాయకమ్మ సూక్తులు అంటూ తెగ మాట్లాడే పూరి తనకోసం ఒకరు విగ్రహం కట్టారంటే సామాన్యుడిలా ఎందుకు పొంగిపోయాడు..? తన వారసుడ్ని విగ్రహ ఆవిష్కరణకు ఎందుకు పంపాడు..? `విగ్రహాలుగా మారేంత అర్హత నాకు లేదు..` అంటూ ఆ ప్రయత్నాన్ని విరమింపచేయొచ్చు కదా? ఇదీ ఓరకమైన ఫాల్స్ప్రెస్టేజీనే అనుకోవాలా?? పూర్వం ఊర్లలో గాంధీకో, నెహ్రూకో విగ్రహాలుండేవి. క్రమంగా.. ప్రతీవోడూ విగ్రహమైపోతున్నాడు. అలాంటప్పుడు దర్శకులకూ హీరోలకూ ఆ స్థానం, స్థాయి ఇవ్వడం తప్పులేదని ఫ్యాన్స్ ఫిక్సవుతున్నారేమో..? రేప్పొద్దుట సినిమాలు, సినిమా తీసేవాళ్ల చరిత్రలూ స్కూలు పాఠాలైపోయినా ఆశ్చర్యపోనవసరం లేదేమో..?? అంతకంటే భావి భారత పౌరులకు ఏం నేర్పగలం మనం?